హైదరాబాద్: కెప్టెన్సీలో ధోనికి ఉన్న అపారమైన అనుభవం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కలిసొస్తుందా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సమయంలో ధోని మీడియాతో మాట్లాడుతూ అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండడం సబబుగా ఉంటుందని ఇందుకు విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉన్నాడని అన్నాడు.
కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా జట్టులో ఆటగాడిగా కొనసాగుతూ, కోహ్లీకి తగిన సూచనలిస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో ధోని ఇచ్చిన సూచనలతోనే కోహ్లీ టీమిండియాను విజయాల బాటలో నడిపిస్తున్నాడని క్రికెట్ విశ్లేషకులంటున్నారు. ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన కోహ్లీ ఇప్పటివరకు వరుసగా సిరిస్‌లను గెలిచాడు.

ఈ క్రమంలో వరుసగా ఏడు సిరీస్‌లలో విజయం సాధించి ధోని పేరిట ఉన్న రికార్డును కోహ్లీ సమం చేశాడు. ధోని 2013 జనవరి, నవంబర్ మధ్య కాలంలో వరసుగా ఏడు సిరిస్‌లలో టీమిండియాను గెలిపించాడు. కోహ్లీ ఆగస్టు 2015 నుంచి ఇప్పటిదాకా వరుసగా 7 సిరీస్‌ల్లో భారత్‌కు విజయాలందించాడు.
ఇటీవల ఇంగ్లాండ్‌తో మగిసిన వన్డే సిరిస్‌లో కోహ్లీ సైతం తన తొలి కెప్టెన్ ధోని నుంచి సలహాలను తీసుకున్న సందర్భాన్ని మనం చూశాం. రెండో వన్డేలో విజయం సాధించిన అనంతరం ధోని సంతకం చేసిన బంతిని కూడా కోహ్లీకి ప్రజెంట్ చేశాడు. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా వెల్లడించాడు.
కోహ్లీ సాధించిన 7 సిరిస్ విజయాలు:
శ్రీలంకతో టెస్టు సిరీస్ 2-1
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ 3-0
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ 2-0
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ 3-0
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ 4-0
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ 2-1
ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ 2-1