
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై టీమిండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారి ప్రశంసల వర్షం కురిపించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోని యువ ఆటగాళ్లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ప్రేరణగా నిలుస్తాడని హనుమ విహారి అన్నాడు.
తాజాగా ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో హనుమ విహారి మాట్లాడుతూ "మైదానం బయట లేదా లోపల అతడు(కోహ్లీ) ఒక ఉదాహరణగా నిలుస్తాడు. డ్రస్సెంగ్ రూమ్‌లోని యువ ఆటగాళ్లకు కోహ్లీ ఒక ప్రేరణ. అతడు మాకొక ఐడల్ లాగా అనిపిస్తాడు. అందుకే మేము అతడిని ఫాలో అవుతాం" అని అన్నాడు.
ఇటీవలే వెస్టిండిస్ వేదికగా ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో హనుమ విహారి 289 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే హనుమ విహారి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఆరో స్థానం లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా హనుమ విహారి అరుదైన ఘనత సాధించాడు. ఇక, టెస్టుల్లో మిడిలార్డర్‌లో ఆడటం తన బలమని హనుమ విహారి చెప్పుకొచ్చాడు.
అటు స్పిన్నర్లతో పాటు పేసర్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొంటానని హనుమ విహారి తెలిపాడు. కాగా, మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇప్పటికే ముగిసిన మూడు టీ20 సిరిస్ 1-1తో సమం అయింది.
అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరిస్‌కు గాయం కారణంగా బుమ్రా దూరమయ్యాడు. అతడి స్థానంలో సెలక్టర్లు ఉమేశ్ యాదవ్‌ను ఎంపిక చేశారు. కాగా, ఈ సిరిస్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మను పరీక్షించనున్నారు.
మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. దక్షిణాఫ్రికా-ఏ జట్టుపై అన్ని అన్ని ఫార్మాట్లలో రాణించిన యువ ఆటగాడు శుభమాన్ గిల్‌కు టెస్టుల్లో తొలిసారి పిలుపు వచ్చింది. సపారీలతో టీ20 సిరిస్‌కు ఎంపిక కాని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్‌కు టెస్టుల్లో చోటు కల్పించారు.
టెస్టు మ్యాచ్ షెడ్యూల్
విశాఖఫట్నం: October 2-6, 9:30 AM IST
పూణె: October 10-14, 9:30 AM IST
రాంచీ: October 19-23, 9:30 AM IST
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు టీమిండియా:
విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే (వైస్‌కెప్టెన్) రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), పుజారా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్