మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌కు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అందుబాటులో ఉండటం అనుమానమే అని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌కు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి కోహ్లి తప్పుకున్నాడు. తొలి రెండు టెస్టులకు ఎంపికైన కోహ్లి తొలి మ్యాచ్ కోసం హైదరాబాద్‌కు కూడా వచ్చాడు. కానీ అత్యవసర పరిస్థితుల వల్ల అదే రోజు తిరిగి ఇంటికి పయనమయ్యాడు.
చివరి మూడు టెస్టులకు కోహ్లి తిరిగి వస్తాడని భావించారంతా. కానీ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కోహ్లి నిర్ణయాన్ని గౌరవిస్తామని బీసీసీఐ అతడికి మద్దతు ఇచ్చింది. అయితే కోహ్లి దూరమవ్వడానికి భిన్నమైన కారణాలు అంటూ తొలుత వార్తలు వచ్చాయి. కానీ తాను రెండో సారి తండ్రి కానున్న నేపథ్యంలో కోహ్లి తప్పుకున్నాడని క్లారిటీ వచ్చింది. కోహ్లి భార్య అనుష్క ఫిబ్రవరి 15న అకాయ్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

అయితే కోహ్లి పునరాగమనంపై సునీల్ గవాస్కర్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. రెండో సారి తండ్రి అవుతున్న సందర్భంగా కోహ్లి జట్టుకు దూరమవ్వడంపై సునీల్ గవాస్కర్ పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడు. 'ఏవో కారణాలతో కోహ్లి ఆడట్లేదు. ఐపీఎల్ అయినా ఆడతాడా? ఐపీఎల్ కూడా ఆడడేమో?' అంటూ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మ్యాచ్‌కు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం కోహ్లి లండన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ ఏర్పాటు చేసే సన్నాహక శిబిరంలో కోహ్లి పాల్గొనవచ్చు.
కాగా, జట్టుకు దూరమైన విరాట్ కోహ్లి తొలిసారి సోషల్‌మీడియాలో స్పందించాడు. మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్‌పై 3-1తో టీమిండియా సిరీస్ నెగ్గడంతో శుభాకాంక్షలు తెలిపాడు. సీనియర్లు లేకపోయినా యువ జట్టు చేసిన పోరాటాన్ని కొనియాడాడు. 'యువ జట్టు అద్భుత విజయం సాధించింది. గొప్ప పట్టుదల, స్థిరత్వం చూపించారు' అని కోహ్లి పోస్ట్ చేశాడు.