టీమిండియా స్టార్ క్రికెటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ గత కొన్ని గంటలుగా పడ్డ టెన్షన్‌కు తెరపడింది. హఠాత్తుగా మాయమైన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ కావడంతో గత కొద్ది గంటలహైడ్రామాకు తెరపడింది . జనవరి 30 అర్ధరాత్రి సమయంలో కోహ్లీ ప్రొఫైల్ కనిపించకుండా పోవడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా కలకలం రేగింది. అర్థరాత్రి నుంచి కనిపించకుండా పోయిన కోహ్లీ ప్రొఫైల్ మళ్లీ యాక్టివేట్ అవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
యూజర్ నాట్ ఫౌండ్.. అభిమానుల్లో టెన్షన్
శుక్రవారం రాత్రి సమయంలో కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను సెర్చ్ చేసిన నెటిజన్లకు 'User Not Found' అనే మెసేజ్ కనిపించింది. సుమారు 270 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న మెగా అకౌంట్ ఇలా ఒక్కసారిగా మాయమవ్వడం చర్చనీయాంశంగా మారింది. కోహ్లీతో పాటు ఆయన సోదరుడు వికాస్ కోహ్లీ అకౌంట్ కూడా అదే సమయంలో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ మరింత కంగారు పడ్డారు. అకౌంట్ హ్యాక్ అయ్యిందా? లేదా కోహ్లీయే స్వయంగా డీయాక్టివేట్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అయ్యాయి.

వదిన.. అన్న అకౌంట్ ఎక్కడ?
విరాట్ కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్ మాయమవ్వడంతో క్లారిటీ కోసం అభిమానులు ఆయన భార్య, నటి అనుష్క శర్మను టార్గెట్ చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల కింద "వదిన గారు.. అన్నయ్య అకౌంట్ ఎక్కడ?" అంటూ పెద్ద ఎత్తున కామెంట్లతో ప్రశ్నల వర్షం కురిపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అదే సమయంలో విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ అకౌంట్ కూడా కనిపించకపోవడం సస్పెన్స్‌ను మరింత పెంచింది. అయితే, అదే సమయంలో విరాట్ 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా మాత్రం యాక్టివ్‌గానే ఉండటం గమనార్హం. ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న అథ్లెట్ కావడంతో బ్రాండ్ విలువ పరంగా కూడా ఇది పెద్ద చర్చకు దారితీసింది.
సాంకేతిక లోపమే కారణమా?
ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్ తిరిగి యాక్టివేట్ అయ్యింది. పాత పోస్టులు, ఫాలోవర్ల సంఖ్య అన్నీ యథాతథంగా కనిపిస్తున్నాయి. అకౌంట్ పునరుద్ధరణతో అభిమానులు సోషల్ మీడియాలో మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. "కింగ్ ఈజ్ బ్యాక్", "అన్న వచ్చేశాడు" అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే, ఈ అంతరాయం సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా అన్నదానిపై విరాట్ టీమ్ గానీ, మెటా సంస్థ గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఏదేమైనా కోహ్లీ అకౌంట్ మళ్లీ తిరిగి రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
నంబర్ 1 బ్యాటర్‌గా కింగ్ కోహ్లీ దూకుడు
విరాట్ కోహ్లీ ఓ వైపు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటే.. మరోవైపు మైదానంలోనూ తన విశ్వరూపం చూపిస్తున్నారు. ఇటీవల కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 పరుగులు చేసి అద్భుత ఫామ్‌ను చాటుకున్నారు. ఈ సెంచరీతో ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటారు. అటు క్రీడా ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నోవాక్ జోకోవిచ్ వంటి దిగ్గజాల సరసన కోహ్లీ నిలిచిన విషయం తెలిసిందే.