హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో అమెరికాలోని న్యూయార్క్‌లో చక్కెర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రేయసితో కలిసి దిగిన సెల్ఫీని అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
తాజాగా కోహ్లీ మరో ఫొటోను తన ట్విటర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ న్యూయార్క్‌లోని బ్రూక్లైన్‌లో ఉన్నాడు. బ్రూక్లైన్‌లోని బున్నా కేఫ్‌లో భోజనం చేసినట్టు పేర్కొన్న కోహ్లీ ఆ ప్రదేశం ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నాడు. కేఫ్ వద్ద దిగిన ఓ సెల్ఫీని కోహ్లీ ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.
అంతకుముందు అనుష్క శర్మతో కలిసి దిగిన ఫొటోను కోహ్లీ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. జులై 14, 15న న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ మైదానంలో జరగనున్న ఐఫా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి అనుష్కతో కలిసి కోహ్లీ హాజరు కానున్నాడు. ఇందులో భాగంగానే కోహ్లీ విండిస్‌తో ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ముగిసిన వెంటనే అమెరికాకు వెళ్లాడు.
మరోవైపు త్వరలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20తో కూడిన సిరిస్ ఆడనుంది. ఈ సిరిస్‌లో భాగంగా జులై 26న భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.