న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారతీయ సెలబ్రెటీలలో అత్యధిక 'విలువ' కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రచారకర్తల్లో కోహ్లీ బ్రాండ్ విలువ భారీగా పెరిగింది. కోహ్లీతో కొత్తగా కుదుర్చుకొనే ఒప్పందాలకు రోజుకు రూ.5 కోట్లు తీసుకోనున్నాడని తెలుస్తోంది.
దీంతో దేశంలోని సెలెబ్రిటీలందరి కన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్న ప్రముఖుడిగా అవతరించాడు. ప్రస్తుతం రోజకు రూ.2.5 నుంచి రూ.4 కోట్ల వరకు అందుకొంటున్నాడు.
అయితే ఈ మధ్యే ముగిసిన పెప్సీకోతో ఒప్పందం మళ్లీ కుదుర్చుకొనేందుకు రోజుకు రూ.5 కోట్లు అడుగుతున్నాడు. ఆ సంస్థ కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సంస్థ ప్రచారం, ప్రకటనలు ఇతర కార్యక్రమాలకు ఏడాదికి నాలుగు రోజులు కేటాయిస్తే రూ.20 కోట్ల వరకు వస్తాయి.

ధోనీ కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉండగా రోజుకు రూ.3-3.5 కోట్లు తీసుకొనేవాడని అంచనా. పీవీ సింధు రూ.1-1.25 కోట్లు, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రణ్‌బీర్, రణవీర్ రోజుకు రూ.3.-3.5 కోట్ల వరకు తీసుకొంటారు.
ప్రస్తుతం తన కెప్టెన్సీ, దూకుడు, అద్భుత ఫామ్‌తో ఉన్న విరాట్ క్రేజ్ పెరిగి బ్రాండ్ విలువ 30 శాతం ఎగిసిందని గ్లోబల్ వాల్యూయేషన్, కార్పొరేట్ అడ్వైజరీ సంస్థ పేర్కొంది. అతడి బ్రాండ్ విలువ 92 మిలియన్ డాలర్లు ఉంటుందని లెక్కగట్టింది.
దీంతో విరాట్‌కు రూ.5 కోట్లు ఇచ్చేందుకు ఆయా సంస్థలు వెనకడుగు వేయడం లేదు. గత నెలలో అంతర్జాతీయ బ్రాండ్ పుమాతో రూ.110 కోట్లకు 8 ఏళ్ల ఒప్పందం కుదుర్చొకొన్న తొలి భారతీయ క్రీడాకారుడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతడి ఖాతాలో ఇప్పుడు 18 బ్రాండ్లు ఉన్నాయి.