హైదరాబాద్: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఇంకా పరీక్షించలేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఆసియా వెలుపల సాధించే ఫలితాల ఆధారంగానే కోహ్లీ సేన సామర్థ్యంపై ఒక అంచనాకు రావాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై 304 పరుగులతే తేడాతో కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగూలీ మీడియాతో మాట్లాడాడు. విదేశీ పర్యటనల్లో కెప్టెన్‌గా కోహ్లీకి అసలు సిసలు పరీక్ష ఎదురుకానుందని గంగూలీ చెప్పాడు.

'బలమైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో భారత్ అత్యంత సమతూకంగా ఉంది. కానీ శ్రీలంకకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత రెండేళ్లుగా భారత్ గొప్పగా ఆడుతోంది. ముఖ్యంగా విదేశాల్లో బాగా రాణిస్తోంది. అనిల్ కుంబ్లే కోచింగ్‌లో వెస్టిండీస్‌లో ఆడిన అన్నీ గెలిచింది. ఆ తర్వాత స్వదేశంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది' అని గంగూలీ చెప్పాడు.
'ఇక్కడి పరిస్థితుల్లో భారత్‌కు ఎలాంటి సవాల్ ఎదురుకాబోదు. కెప్టెన్‌గా కోహ్లీకి ఇంకా పరీక్ష ఎదురుకాలేదు. ప్రస్తుతం లంక బలంగా లేదు. ఫ్యాన్స్‌కు, విరాట్‌కు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ల్లో టీమిండియా ఏమేరకు రాణిస్తుందో అదే కొలమానం అవుతుంది' అని గంగూలీ అన్నాడు.