
న్యూ ఢిల్లీ: అభిమానులపై ఆదరణ కురిపించే టీమిండియా కెప్టెన్ కోహ్లీ మరోసారి అదే విషయమై వార్తల్లో నిలిచాడు. పాకిస్థాన్ జర్నలిస్టుకు విరాట్ కోహ్లీ తన జెర్సీని కానుకగా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆ జర్నలిస్టు ట్విటర్ ద్వారా పంచుకుని కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు. ఇంతకీ ఆ పాక్ జర్నలిస్ట్ ఎవరంటే సయ్యద్ హుస్సైనీ. ఈయన స్పోర్ట్స్ జర్నలిస్టు.
తనదైన బ్యాటింగ్ శైలితో, రికార్డులు బద్దులకొడుతూ విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవల నాటింగ్‌హామ్‌లో కూడా ఓ చిన్నారి అభిమాని ఫొటో దిగాలని అడగ్గా కుటుంబం మొత్తానికి సెల్ఫీ దిగి ఆటోగ్రాఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లీ కోసం అభిమానులు ఇలా పలు సందర్భాలు భద్రతా సిబ్బందిని దాటి పలుమార్లు కోహ్లీ అభిమానులతో సందడి చేసిన సంఘటనలు ఎన్నో. ఈ క్రమంలోనే కోహ్లీ పాక్ జర్నలిస్టు సయ్యద్ కోరికను తీర్చి ఉంటాడు.
కోహ్లీ ప్రాక్టీస్ చేసే సమయంలో వేసుకునే జెర్సీపై సంతకం చేసి సయ్యద్‌కు పంపాడు. కోహ్లీ పంపిన జెర్సీని ట్విటర్ ద్వారా పంచుకున్న సయ్యద్ 'సంతకం చేసిన జెర్సీని పంపించినందుకు కోహ్లీకి ధన్యవాదాలు. నువ్వు ఎంతో మందికి స్ఫూర్తి. మేము నిన్ను ఎంతో ప్రేమిస్తాం' అని పేర్కొన్నాడు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నాడు. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఈ నెల 30న ప్రారంభంకానుంది. మూడు టెస్టులు ముగిసే సమయానికి భారత్ 1-2తో వెనుకంజలో ఉంది. నాలుగో టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. మరో పక్క ఇంగ్లాండ్ ఈ టెస్టులో గెలిచి మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.