హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాళ్లను ఎదుర్కోవడం అంటే ఇష్టమని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ తెలిపాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమిని చవిచూడటంతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగింది.
ఈ క్రమంలో పలువురు మాజీలు టీమిండియాకు మద్దతుగా నిలిచారు. ఈ టెస్టు సిరిస్‌ను నెగ్గే అవకాశం ఇంకా ఉందని అంటున్నారు. ఈ క్రమంలో కోహ్లీ చిన్ననాటి కోచ్ క్రికెట్ నెక్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో బెంగుళూరులో జరిగే రెండో టెస్టులో కోహ్లీసేన తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
పూణెలో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ ప్రదర్శన గురించి తాను మాట్లాడనని, గేమ్‌లో గెలుపోటములు సహజమని శర్మ చెప్పాడు. ఓటమి నుంచి ఎంతో నేర్చుకోవాలని, కోహ్లీ పోరాట యోధుడని, అతడు సవాళ్లను ఇష్టపడతాడని చెప్పాడు. ఇక బెంగళూరులో జరిగే రెండో టెస్టు కోహ్లీతో పాటు అతని బృందానికి ఎంతో ముఖ్యమైందని చెప్పాడు.

రెండో టెస్టులో కోహ్లీ సేన మరింత కాన్ఫిడెంట్‌గా మైదానంలోనికి అడుగుపెడుతుందని రాజ్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కోహ్లీ పాలి ఉమ్రిగర్ అవార్డుకి ఎంపిక అవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. కోహ్లీ ఎంతో అంకిత భావం కలిగి ఉంటాడని, 10 ఏళ్ల వయసులోనే వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడని తెలిపాడు.
ప్రస్తుతం కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని చెప్పాడు. ఇదే ఫామ్‌ని మరి కొన్నాళ్లపాటు కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. కాగా, బీసీసీఐ ప్రకటించిన అవార్డుల్లో పాలీ ఉమ్రిగర్ అవార్డును కోహ్లీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే భారత్, ఆసీస్‌ల మధ్య ఫిబ్రవరి 4న బెంగుళూరులో రెండో టెస్టు ప్రారంభం కానుంది.