కోహ్లీ వ్యతిరేకిస్తున్నాడన్న వార్తల్లో నిజం లేదు: డే నైట్ టెస్టులపై గంగూలీ

హైదరాబాద్: డే-నైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సుముఖంగానే ఉన్నాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన సౌరవ్ గంగూలీని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) శుక్రవారం ఘనంగా సన్మానించింది. ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "డే-నైట్ టెస్టులను కోహ్లీ వ్యతిరేకిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అ వార్తలు నిజం కాదు. అతడు అనుకూలంగానే ఉన్నాడు. కెప్టెన్ సుముఖంగా ఉన్నాడంటే డే-నైట్ టెస్టు కార్యరూపం దాల్చడం చాలా సులభం. అయితే, ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తోందనేది చెప్పలేను. ఆటను ముందుకు తీసుకుపోవాలి" అని గంగూలీ అన్నాడు.

నాకు డే-నైట్ టెస్టులపై గట్టి నమ్మకం ఉంది
"మేమందరం దీని గురించి ఆలోచిస్తున్నాము. దీనికోసం ఏదైనా చేస్తాము. నాకు డే-నైట్ టెస్టులపై గట్టి నమ్మకం ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. నేను పదవిలో ఉండగానే గులాబీ బంతితో మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తా" అని గంగూలీ తెలిపాడు. నిజానికి దులీప్ ట్రోఫీని డే-నైట్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది గంగూలీనే.

దులీప్ ట్రోఫీలో పింక్ బాల్
దీంతో 2016 దులీప్ ట్రోఫీలో బీసీసీఐ విన్నూతంగా పింక్ బాల్‌ను ఉపయోగించింది. అయితే, అప్పట్లో ఈ టెస్టుపై అనేక ఫిర్యాదులు రావడంతో డే-నైట్ టోర్నీ మరుగున పడింది. పింక్ బంతి నాణ్యత అంతగా లేదని బౌలర్లు ఫిర్యాదు చేశారు. స్వింగ్ అయినప్పుడు సాయంత్రం వేళల్లో వెలుతురు తగ్గి బంతిని చూడటం కష్టంగా ఉందని బ్యాట్స్‌మెన్ తెలిపారు.

ఆసక్తి చూపని భారత్
ఈ కారణం చేతనే అంతర్జాతీయస్థాయిలో డే-నైట్ టెస్టులపై భారత్ ఆసక్తి చూపించడం లేదు. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ తర్వాత 2020 డిసెంబర్ వరకు భారత్ స్వదేశంలో టెస్టులు ఆడటం లేదు. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవిలో కేవలం 10 నెలలు మాత్రమే ఉంటాడు. దీంతో దాదా ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి మరి.
విరుద్ధ ప్రయోజనాల నిబంధనపై మరోసారి
మరోవైపు విరుద్ధ ప్రయోజనాల నిబంధనను మార్చాల్సిన అవసరం ఉందని దాదా తెలిపాడు. "విరుద్ధ ప్రయోజనాల నిబంధనను మరోసారి పరిశీలించాలి. దీని వల్ల బోర్డులో నాణ్యమైన ఆటగాళ్ల సేవలను కోల్పోతున్నాం. కపిల్‌దేవ్, సునీల్ గవాస్కర్, అజహరుద్దీన్, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి ఆటగాళ్ల సేవలను వినియోగించుకోవాలి" అని దాదా పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications