
అంతకుముందు రాణించిన హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ 2022 సీజన్లో ముంబైలోని వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 168పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (62పరుగులు 47బంతుల్లో 4ఫోర్లు 3సిక్సర్లు నాటౌట్), డేవిడ్ మిల్లర్ (34పరుగులు 25బంతుల్లో 3సిక్సర్లు) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో హజిల్ వుడ్ 2, హసరంగ 1, మ్యాక్స్ వెల్ 1వికెట్ తీశారు. గుజరాత్ విధించిన 169పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ ఛేదించి ప్లేఆఫ్ రేసులో నిలిచింది.

సీరియస్‌గా తీసుకున్న కోహ్లీ
ఇక ప్లేఆఫ్ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడేమో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. షమీ వేసిన మూడో ఓవర్లో బౌండరీలు మొదలెట్టిన కోహ్లీ తన రిథమ్ కొనసాగించాడు. ఆ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్లోనూ కోహ్లీ రెండు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డు మూమెంటమ్ పెంచేశాడు. ఆ తర్వాత అడపాదడపా ఫోర్లు కొడుతూ మంచి స్ట్రైక్ రేట్ మెయింటెన్ చేశాడు. ఈ క్రమంలో 10వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలిగ్లో సిక్సు కొట్టిన కోహ్లీ 33బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్ ధాటికి తోడు డుప్లెసిస్ కూడా బౌండరీలతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి ధాటికి గుజరాత్ బౌలర్లు తేలిపోయారు. స్కోరు బోర్డు 12ఓవర్లకే వికెట్ కోల్పోకుండా 102పరుగులకు స్కోరు చేరుకుంది. తొలి వికెట్‌కు వీరిద్దరు కలిసి 115పరుగులు జోడించారు.

తుఫాన్ ఇన్నింగ్స్‌తో ముగించిన మ్యాక్స్ వెల్
ఇక ఈ జోడీని రషీద్ ఖాన్ విడదీశాడు. తన తెలివైన బంతితో డుప్లెసిస్ ను క్యాచ్ అవుట్ చేశాడు. డుప్లెసిస్ అవుట్ అయినప్పటికీ క్రీజులో దిగిన మ్యాక్స్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16వ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయగా ఆ ఓవర్లో రెండు సిక్సులు, ఒక ఫోర్ కొట్టిన మ్యాక్సీ ఆ ఓవర్లో 18పరుగులు పిండుకున్నాడు. రషీద్ వేసిన 17వ ఓవర్లో సిక్సు కొట్టిన కోహ్లీ.. తర్వాత బంతికి హిట్టింగ్ చేయాలని చూసి స్టంప్ అవుట్ అయ్యాడు. అప్పటికే ఆర్సీబీ విజయానికి చేరువైపోయింది. ఇక 19వ ఓవర్లో మ్యాక్స్ వెల్ వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో ఆర్సీబీ ఘన విజయం అందుకుంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.