
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు చాలా ఘోరంగా ఓటమిపాలైంది. ఏకంగా పది వికెట్ల తేడాతో టీమిండియాను కంగారూలు చిత్తు చేశారు. విశాఖ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ (31) ఒక్కడే కొంచెం క్రీజులో కుదురుకున్నట్లు కనిపించాడు. కానీ చివకు నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో ఎల్బీ డబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తొలి వన్డేలో కూడా కోహ్లీ ఇదే మాదిరి ఎల్బీడబ్ల్యూ అవుటవడం అభిమానులకు ఆందోళన కలిగించింది.
అయితే కోహ్లీ ఈ మ్యాచ్‌లో అవుటవడానికి కాన్‌సన్‌ట్రేషన్ కోల్పోవడమే కారణమని మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ అంటున్నాడు. లేదంటే అతను కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఫీల్ అవడంతో ఇలా పెవిలియన్ చేరాడని అభిప్రాయపడ్డాడు. 'కాన్‌సన్‌ట్రేషన్ కోల్పోవడం వల్లనో లేదంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనో కోహ్లీ అవుటయ్యాడు. నాథన్ ఎల్లీస్ నాలుగో బౌలర్‌గా రావడంతో ఇలా జరిగి ఉండొచ్చు' అని చెప్పాడు. మిచెల్ స్టార్క్, షాన్ ఆబాట్ వేసిన ప్రమాదకరమైన స్పెల్స్‌ను చక్కగా ఎదుర్కొన్న కోహ్లీ.. ఎల్లీస్ బౌలింగ్‌ను తక్కువ అంచనా వేశాడని, ఈ క్రమంలోనే పెవిలియన్ చేరాడని వెల్లడించాడు.
'ప్రధాన బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని, వాళ్లకు వికెట్ ఇవ్వకపోతే మన కాన్ఫిడెన్స్ పెరగడం సహజమే. అంతేకాదు, బంతి గనుక అతని ప్యాడ్ బయటి వైపు తగిలి ఉంటే అది నాటౌట్. అది లోపలి వైపుకు తగలడంతో అవుటయ్యాడు.' అని చెప్పాడు. ఇలా అవుటైనప్పటికీ భారత్ తరఫున కోహ్లీనే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. అతని తర్వాత అక్షర్ పటేల్ (29 నాటౌట్) ఒక్కడే కొంత డామినేటింగ్‌గా ఆడాడు. మిగతా బ్యాటర్లంతా క్రీజులో చాలా ఇబ్బందిగా కదిలారు. ఈ నేపథ్యంలోనే భారత్ నిర్దేశించిన 118 పరుగుల టార్గెట్‌ను ఆసీస్ ఓపెనర్లు 11 ఓవర్లలోనే ఛేజ్ చేసేశారు.