హైదరాబాద్: ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో విజయం సాధించి ఇంగ్లాండ్‌పై 3-0తో సిరిస్‌ను కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఒక విశిష్టమైన వ్యక్తి నుంచి అరుదైన బహుమతి అందింది.
ముంబై టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ (235) పరుగులు సాధించి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. అంతేకాదు నాలుగో టెస్టులో మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డుని సైతం అందుకున్నాడు. ఈ క్రమంలో వాంఖడెలో కోహ్లీ ఆడిన ఆ ఇన్నింగ్స్‌కు భారతరత్న, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కూడా ఎంతగానో మురిసిపోయారు.
ముంబై టెస్టు విజయంతో పాటు సిరీస్ కూడా గెలుచుకున్న కోహ్లీసేనను పలువురు అభినందనల్లో ముంచెత్తారు. అందరిలాగే లతామంగేష్కర్ కూడా కోహ్లీని అభినందించాలనుకున్నారు. అయితే అందరిలాగా కాకూండా ప్రత్యేకంగా అభినందించారు.
తాను పాడిన ఆణిముత్యాల్లాంటి పాటల్లోంచి ఒక మంచి ముత్యాన్ని ఆమె తన ట్విట్టర్‌లో కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. అందులో ''235 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి అభినందనలు తెలియజేస్తున్నాను'' అని చెప్పడమే కాక, తాను పాడిన 'ఆకాశ్ కే ఉస్ పార్ భీ' అనే పాట యూట్యూబ్ లింకును కూడా పెట్టారు.
కాగా, ముంబై టెస్టులో కోహ్లీ, అశ్విన్‌లతో పాటు టీమిండియా పలు రికార్డులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో భారత్‌కు ఇది 135వ గెలుపు కావడం విశేషం. ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇది 24వ టెస్టు విజయం. ఈ టెస్టు సిరిస్‌తో టీమిండియా వరుసగా ఐదు టెస్టు సిరిస్‌లను కైవసం చేసుకుంది.
ముంబై టెస్టుతో తన టెస్టు కెరీర్‌లో 24వ సారి అశ్విన్ 5 వికెట్లను తీసుకున్నాడు. దీంతో టెస్టుల్లో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డుని అశ్విన్ అధిగమించాడు. ముంబై టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అశ్విన్ 12 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆరు వికెట్లు తీశాడు.
దాంతో 10 వికెట్లను అత్యధిక సార్లు తీసిన భారత రెండో బౌలర్‌గా అశ్విన్ గుర్తింపు పొందాడు. 43 టెస్టుల్లో అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు.