న్యూఢిల్లీ: భారత క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఆగ్రహాన్ని చూపించాడు. దక్షిణాఫ్రికాపై జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు శనివారంనాడు ఆయన ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తన ఆగ్రహం రుచి చూపించాడు.
తప్పుడు ఔట్ ఇచ్చినందుకు మొదట దిగ్భ్రాంతికి గురైన కోహ్లీ ఆ తర్వాత ఆస్ట్రేలియా అంపైర్ బ్రూస్ ఆక్షెన్‌ఫోర్డుపై గుర్రుమన్నాడు. ఇమ్రాన్ తాహిర్ బౌలింగులో అది జరిగింది. అయితే, విరాట్ కోహ్లీకి ఊరట లభించింది. ఆ తర్వాత అతను కోహ్లీ తన ఇన్నింగ్సు కొనసాగించాడు. అప్పటికి అతను ఐదు పరుగులు చేశాడు.
థర్డ్ అంపైర్ సికె నందన్ పరిశీలించి ఇమ్రాన్ తాహిర్ వేసింది లీగల్ డెలివరీ కాదని, కోహ్లీ అవుట్ కాలేదని చెప్పే వరకు అంపైర్ విరాట్ కోహ్లీ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. భారత్ రెండో ఇన్నింగ్సు 34వ ఓవర్ తొలి బంతి సందర్భంలో ఇది జరిగింది. తాహిర్ వేసిన బంతిని కోహ్లీ కొట్టాడు. అది సీదాగా వికెట్ కీపర్ డానె విలాస్ చేతిలోకి వెళ్లింది.

అంపైర్ ఔట్ ఇచ్చాడు. కానీ కోహ్లీ క్రీజు నుంచి కదలడానికి నిరాకరించాడు. కొన్ని సెకన్ల పాటు కోపంతో అలాగే నిలబడి మెల్లగా వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో ఆగాలని అంపైర్ సూచించాడు. థర్డ్ అంపైర్‌తో ఆక్సెన్‌ఫోర్డ్ పరిశీలింపజేశాడు.
థర్డ్ అంపైర్ పరిశీలనలో తాహిర్ నో బాల్ వేశాడని తేలింది. అయితే, థర్డ్ అంపైర్ నిర్ణయం వెలువడే వరకు కోహ్లీ నోటి నుంచి మాటలు వెలుడుతూ వచ్చాయి. బంతి బ్యాట్‌కు తాకలేదని కూడా కోహ్లీ చెప్పడానికి ప్రయత్నించాడు.