
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కొంత కాలంగా ఫామ్ లేక నానా తిప్పలూ పడ్డాడు. అయితే గతేడాది ఒక నెలరోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకొని, ఆటకు దూరంగా ఉండటంతో అతని ఇంజిన్‌లు మళ్లీ అద్భుతంగా రన్ అవుతున్నాయి. పునరాగమనంలో ఆసియా కప్‌లో అదరగొట్టిన కోహ్లీ.. తన మూడేళ్ల సెంచరీ కరువు తీర్చుకున్నాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌పై సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు ఇప్పుడప్పుడే మర్చిపోలేరు కూడా.
టీ20 వరల్డ్ కప్ టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీ.. జట్టుకు కప్పు అందించడంలో మాత్రం విఫలమయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో తొలి రెండు వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోని కోహ్లీ.. మూడో వన్డేలో చెలరేగాడు. తనకు అచ్చొచ్చిన ఫార్మాట్లో కూడా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొత్త సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న అతను.. వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. తొలి మ్యాచ్‌లోనే 118 పరుగులతో ఆకట్టుకున్నాడు. కొత్త ఏడాదిని కోహ్లీ సెంచరీతో ప్రారంభించడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.

దీనిపై మాజీ లెజెండ్ వసీం జాఫర్ కూడా స్పందించాడు. కోహ్లీ ఒక్కసారి ఫామ్ అందుకుంటే అది ఒక్కరోజుతో పోయేది కాదని జాఫర్ స్పష్టం చేశాడు. కోహ్లీ కెరీర్‌ను గమనిస్తే.. అతను ఫామ్ ఏళ్ల తరబడి కొనసాగుతుందని అర్థం అవుతుందని చెప్పాడు. అదే సమయంలో రోహిత్ కూడా మంచి టచ్‌లో కనిపించడం టీమిండియాకు శుభసూచకం అన్నాడు. వీళ్లిద్దరూ ఇదే ఫామ్ కొనసాగిస్తే స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు చాలా బలంగా కనిపిస్తుందన్నాడు. అభిమానులు కూడా కోహ్లీ, రోహిత్ ఫామ్ చూసి, వీళ్లిద్దరూ కలిసి వన్డే ఫార్మాట్‌ను ఏలిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు.