
లండన్: ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్ చేజిక్కించుకోవాలంటే మూడో టెస్టులో గెలవడం తప్ప టీమిండియాకు మరోదారి లేదని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఈ సిరిస్‌లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు ముగియగా.. రెండింటిలోనూ కోహ్లీసేన ఓడిపోయింది.
ఈ నేపథ్యంలో మూడో టెస్టు ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ తుది జట్టులోనూ మార్పులు ఉంటాయని పరోక్షంగా వెల్లడించాడు. రెండో టెస్టులో వెన్నునొప్పితో చివరి రోజు బాధపడిన ఫిట్‌నెస్ సాధించినట్లు తెలిపాడు.
ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ "మూడో టెస్టులో గెలవడం తప్ప మనకి మరో ఆప్షన్ లేదని జట్టులోని ఆటగాళ్లందరికీ సమావేశంలో చెప్పాను. అదే విషయాన్ని మైదానంలో బాడీ లాంగ్వేజ్, నిబద్ధత ద్వారా మేము చూపుతాం" అని అన్నాడు.
"దీనికి అనుగుణంగానే ప్రాక్టీస్ సెషన్స్‌లో భారత్ జట్టు సిద్ధమైంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఇకనైనా బాధ్యత తీసుకుని బోర్డుపై పరుగులు ఉంచాలి. 20 వికెట్లు తీయలేమనేది పాత మాట. ఇప్పుడు బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కాబట్టి.. ఇప్పుడు జట్టుని గెలిపించే బాధ్యత బ్యాట్స్‌మెన్స్‌దే. బుమ్రా అత్యుత్తమ బౌలర్" అని కోహ్లీ చెప్పాడు.
"అతని పునరాగమనం కోసం మేము ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. అతను జట్టులో ఉంటే బలం పెరుగుతుంది. ఇక తుది జట్టు ఎంపికపై వస్తున్న విమర్శలను నేను పట్టించుకోను. నాకు జట్టు గెలుపే ముఖ్యం. ఇందులో ఆటగాళ్ల కెరీర్, ప్రయోజనాలకి తావులేదు" అని కోహ్లీ స్పష్టం చేశాడు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన కోహ్లీసేన కనీసం ఈ టెస్టుతోనైనా సిరీస్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది.