'దురుద్దేశంతోనే రవిశాస్త్రిపై ట్రోలింగ్.. అవేమి ఆయనపై ప్రభావం చూపవు'

ముంబై: టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రిపై సోషల్ మీడియాలో ఓ అజెండా ప్రకారమే ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే అవేమి ఆయనపై ఏ మాత్రం ప్రభావం చూపవని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇటీవలి కాలంలో శాస్త్రి స్లీపింగ్ ఫొటో, బీచ్ ఫొటోలపై కొందరు విపరీతంగా ట్రోలింగ్ చేసారు. కోహ్లీ చెప్పిన ప్రతి మాటకు తలూపుతాడనే అపవాదులు కూడా వచ్చాయి. అయితే వీటన్నింటిని కోహ్లీ కొట్టిపారేశారు.

దురుద్దేశంతోనే ట్రోలింగ్:
శనివారం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... 'దురుద్దేశంతోనే రవిశాస్త్రిపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరు, ఎందుకు చేస్తున్నారో తెలీదు. ట్రోలింగ్ చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టే కనిపిస్తోంది. అయితే శాస్త్రి ఇలాంటివి పట్టించుకొనే వ్యక్తికాదు. స్పిన్నర్‌గా జట్టులోకి అడుగుపెట్టిన శాస్త్రి వేగంగా ఎదిగాడు. పదో స్థానం నుంచి ఓపెనింగ్ చేశాడు. సగటు 41 సాధించాడు' అని పేర్కొన్నాడు.

శాస్త్రి వారిని పట్టించుకోడు:
'ఇంటివద్ద కూర్చొని ట్రోలింగ్ చేసేవాళ్లని శాస్త్రి పట్టించుకోడు. అలాంటి వ్యక్తిని ట్రోల్ చేయాలనుకుంటే బౌలర్లను ఎదుర్కొని, ఆయన సాధించిన ఘనతలు సాధించండి. అవి చేసేందుకు ధైర్యం చేయండి. ఆ తర్వాత ఆయనను ట్రోలింగ్ చేయండి. రవిశాస్త్రి చాలా సరదాగా ఉంటారు. ఎప్పటికీ అత్యుత్తమ జట్టుగా నిలవడమే మా లక్ష్యంగా చెప్పాడు. అలాంటప్పుడు బయట విషయాలు పట్టించుకోం' అని కోహ్లీ తెలిపాడు.

పేసర్లు అద్భుతం:
'టీమిండియా బాగా ఆడుతోంది. ముఖ్యంగా పేసర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఎవరికీ ఈర్ష్య లేకపోవడం వారి ప్రధాన బలం. షమీది ఏడో ర్యాంకా, బుమ్రాది 1వ ర్యాంకా, ఇషాంత్ ఏ ర్యాంకులో ఉన్నాడో ఇవేమి వాళ్ళు పట్టించుకోరు. అందుకే మంచి ప్రదర్శన చేస్తున్నారు. క్రిస్టియన్ రొనాల్డొ ఆత్మబలం, తిరిగి పుంజుకోవాలన్న కసి అంటే ఎంతో ఇష్టం. ప్రతిసారి జట్టు గెలుపు కోసమే కష్టపడతా' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు .

ఏడాదికి రూ. 10 కోట్లు:
రెండోసారి హెడ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి 2021లో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకూ ఆ పదవిలో ఉండనున్నాడు. రవిశాస్త్రి జీతాన్ని బీసీసీఐ మరో 20 శాతం పెంచింది. రవిశాస్త్రికి ప్రస్తుతం ఏడాదికి రూ. 9.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య జీతాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది. తాజాగా 20 శాతం పెంచడంతో గతంలో కంటే అతని జీతం దాదాపు రూ. 1.5 కోట్ల మేర పెరిగింది. వన్డే ప్రపంచకప్ ఓటమి నేపథ్యంలో రవిశాస్త్రిపై వేటు పడుతుందని అంతా ఊహించారు. కానీ.. బీసీసీఐ మళ్లీ అతడికే పట్టం కట్టింది.

అగ్రస్థానంలో భారత్:
భారత క్రికెట్ జట్టుతో రవిశాస్త్రి ప్రయాణం గొప్పగా ఉంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్రస్తుతం 360 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియాను అధిగమించి స్వదేశంలో వరుసగా 12 టెస్ట్ సిరీస్‌లను సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం చెలాయించి సిరీస్లను నెగ్గింది. అంతకుముందు వెస్టిండీస్‌ను 2-0తో ఓడించింది. వచ్చే నెల 6 నుండి విండీస్ సిరీస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications