హైదరాబాద్: ఆతిథ్య శ్రీలంకతో బుధవారం జరిగిన ఏకైక టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 15వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు మొత్తం 304 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి (మూడు ఫార్మాట్‌లలో కలిపి) అతడు ఈ ఘనత సాధించాడు.
ఇప్పటి వరకు కోహ్లీ 60 టెస్టుల్లో 4,658 పరుగులు, 194 వన్డేల్లో 8,587 పరుగులు, 50 టీ20ల్లో 1,830 పరుగులు సాధించాడు. ఇవన్నీ కలిపితే మొత్తం 15,075 పరుగులు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో 15వేల పరుగులు పూర్తి చేసిన 33వ ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.
అయితే 50పైగా యావరేజితో ఈ రికార్డు సాధించిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 54 బంతుల్లో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సైతం అందుకున్నాడు.
బుధవారం జరిగిన టీ20 కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్‌లో 50వ టీ20 కావడం విశేషం. ఈ క్రమంలో కోహ్లీ పలు రికార్డులను సైతం అధిగమించాడు. అంతేకాదు టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
అతనికంటే ముందు బ్రెండన్ మెక్‌కలమ్(2,140), తిలకరత్నే దిల్షాన్(1,889) మాత్రమే ఉన్నారు. తన కెరీర్‌లో 50వ టి20 మ్యాచ్ ఆడిన కోహ్లీ సురేశ్ రైనా (6872)ను అధిగమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
భారత్ తరఫున 50 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఐదో క్రికెటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇక ఛేదనలోనే అత్యధిక పరుగులు (1,016) చేసిన బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు. మెకల్లమ్ (1,006) రికార్డును కోహ్లీ అధిగమించాడు. డేవిడ్ వార్నర్ (892), మార్టిన్ గుప్తిల్ (882), మహమ్మద్ షెజాద్ (819) ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.
ఏకైక టీ20: 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
శ్రీలంక పర్యటనను టీమ్ ఇండియా ఘనంగా ముగించింది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన ఏకైక టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆతిధ్య జట్టు నిర్దేశించిన 171 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో చేధించింది. శ్రీలంకతో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(82), మనీశ్ పాండే(51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

రోహిత్ శర్మ 9, రాహుల్ 24, ధోనీ 1 పరుగులు చేశారు. ఈ విజయంతో కోహ్లీసేన మరో అద్భుత రికార్డుని నెలకొల్పింది. శ్రీలంకను టెస్టుల్లో 3-0తో, వన్డేల్లో 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగే ఏకైక టీ20లో కూడా గెలవడంతో 9-0తో శ్రీలంకను చిత్తుచేసిన జట్టుగా ఘన చరిత్ర సాధించింది.
ఇంతకు ముందు ఇలాంటి ఘనత ఆస్ట్రేలియా మాత్రమే సాధించింది. 2009-10లో పాక్‌ను 3-0తో టెస్టుల్లో, 5-0తో వన్డేల్లో, 1-0తో టీ20లో ఓడించింది. ఇప్పుడు శ్రీలంకపై కోహ్లీసేన సరిగ్గా అలానే విజయం సాధించింది. దీంతో టీమిండియా చరిత్రలోనే ఇది ఓ మైలురాయిగా నిలిచింది.