హైదరాబాద్: ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే భారత్ చేరుకుంది. సెప్టెంబర్ 17న చెన్నైలో జరిగే తొలి వన్డేతో ఈ సిరిస్ ఆరంభం కానుంది. అయితే, సిరిస్ ఆరంభానికి ముందే మైండ్‌గేమ్ మొదలైంది.
ఈ ఏడాది ఆరంభంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ జరిగినప్పుడు కెప్టెన్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా చెత్తరాతలు రాసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే ఆస్ట్రేలియాకు చెందిన ఓ జర్నలిస్ట్ కోహ్లీని స్వీపర్‌తో పోల్చడం వివాదాస్పదమైంది.

వివరాల్లోకి వెళితే... స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అంతకముందు కోహ్లీ సేన కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ మైదానాన్ని శుభ్రం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోని డెన్నిస్ ఫ్రీడ్‌మాన్ అనే ఆస్ట్రేలియా జర్నలిస్టు తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసి 'ప్రపంచ ఎలెవన్ మ్యాచ్ కోసం కార్మికులు మైదానాన్ని శుభ్రం చేస్తున్నారు' కామెంట్ పెట్టాడు.
టీమిండియా కెప్టెన్‌ని స్వీపర్‌తో పోల్చడంతో అభిమానులు డెన్నిస్ ఫ్రీడ్‌మాన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అతడి ట్వీట్‌కు రీట్వీట్లు పెడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 'పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ చెత్తను కోహ్లీ శుభ్రం చేస్తున్నాడు' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
'భారతీయులు ఎంత మంచి వారో ఈ ఫొటోను చూస్తే తెలుస్తోంది' అని మరో నెటిజన్ ట్వీట్ చేయగా.. 'కార్మికులు కష్టజీవులు.. దేశం తరఫున ఆడే కోహ్లీ సేనను కార్మికులు అనడంలో తప్పులేదు' అని ట్వీట్ చేశారు.