
హైదరాబాద్: కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే ఔటయ్యాడనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిన అభిమాని మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.... మధ్యప్రదేశ్‌లోని రాట్లాంకు చెందిన 63 ఏళ్ల బాబులాల్ భైరవ కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని.
విరాట్ కోహ్లీ ఆడే అన్ని మ్యాచ్‌లను బాబులాల్ క్రమం తప్పకుండా చూస్తూంటాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ని బాబులాల్ ఇంట్లో ఒంటరిగా కూర్చొని చూశాడు. తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ ఏదో చేస్తాడని ఆశగా ఎదురుచూశాడు.
అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులకే మోర్నీ మోర్కెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో బాబూలాల్ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చి మంటలార్పి అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ ఘటనలో బాబులాల్ తల, చేతులు, కాళ్ల భాగాలు తీవ్రంగా గాయపడటంతో అతను బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, తొలి టెస్టులో టీమిండియాపై
దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ శనివారం (జనవరి 13)న సెంచూరియన్ వేదికగా జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.