

హైదరాబాద్: విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టీమిండియా బ్యాటింగ్‌లో విఫలం కావడంతోనే సిరిస్‌లు కోల్పోవాల్సి వస్తోందని కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 72 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్( 33 నాటౌట్), పృథ్వీ షా(33 నాటౌట్)లు వికెట్ పడకుండా ఆడి టీమిండియాకు విజయాన్ని అందించారు.
దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అంతేకాదు ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ని మూడు రోజుల్లోనే ముగించింది. ఈ టెస్టు విజయం సొంతగడ్డపై టీమిండియాకు వరుసగా పదో టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం. ఈ టెస్టు మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తమకు బౌలింగ్ అనేది సమస్యే కావడం లేదని అన్నాడు.
"మేము విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు బ్యాటింగ్ అనేది సమస్యగా మారింది. ముఖ్యంగా మా బ్యాటింగ్‌లో నిలకడ ఉండటం లేదు. దీంతోనే విదేశాల్లో సిరిస్‌లను నెగ్గడంలో విఫలమవుతున్నాం. విదేశీ సిరీస్‌లను గెలవాలంటే బ్యాటింగ్ అనేది మెరుగుపడాలి. అప్పుడే అక్కడ‍్నుంచి సగర్వంగా స్వదేశానికి రాగలం" అని కోహ్లీ తెలిపాడు.
"బౌలింగ్ విషయానికొస్తే మాకు ఎలాంటి సమస్య లేదు. బౌలర్లు తమ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నారు. గత సిరీస్ నుంచి చూస్తే టెస్టుల్లో 20 వికెట్లను మా బౌలర్లు తీయగలుతున్నారు. బ్యాటింగ్ విషయంలో స్వదేశంలో పూర్తిస్థాయిలో ఆడుతున్నాం. ఇదే ప్రదర్శన విదేశాల్లో కూడా పునరావృతం చేయాలి" అని కోహ్లీ పేర్కొన్నాడు.