
హైదరాబాద్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చివరి వరకు పోరాడి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ విఫలం కావడం... మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో కోహ్లీసేన చివరికి చేతులెత్తేసింది.
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా పోరాడినప్పటికీ ఓటమి నుంచి మాత్రం జట్టును కాపాడలేకపోయాడు. జట్టులోని మగితా సహచరుల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో కోహ్లీ ఒంటరి పోరాటం వృథా అయింది. దీంతో ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ ఆడిన ఏడు టెస్టుల్లో ఏ ఒక్కటీ గెలవలేదు.
తాజా ఓటమి టీమిండియాకు ఆరో ఓటమి. ఒక మ్యాచ్ మాత్రం డ్రా అయింది. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియానే కాదు, ఏ ఆసియా జట్టూ ఇంగ్లాండ్‌ను ఓడించలేక పోవడం విశేషం. ఇదిలా ఉంటే, తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ కెప్టెన్ కోహ్లీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత్ ఓడిపోయిన టెస్టు మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా సరికొత్త రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సెంచరీలు చేసిన ఐదు టెస్టుల్లో టీమిండియా ఓటమి పాలైంది. విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రయాన్ లారా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
టెస్టుల్లో అతడు సెంచరీలు చేసిన ఐదు మ్యాచుల్లోనూ జట్టు ఓటమి పాలైంది. ఇప్పుడు ఆ రికార్డుని కోహ్లీ సమం చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా 4 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.