ఇండోర్: ఇంటి దగ్గర ఒకరోజు అదనంగా ఉండే అవకాశం రావడంతో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషంగా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు మిగిలుండగానే టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు కివీస్‌పై 3-0తేడాతో విజయం సాధించి సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఆటగాళ్లకు ఇంటి దగ్గర గడిపేందుకు ఒక రోజు ఎక్స్‌ట్రాగా ఖాళీ సమయం దొరికింది. దీంతో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంచక్కా ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా కారులో ప్రయాణిస్తూ తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

''ఒక్క రోజు అదనంగా ఇంటిదగ్గర ఉండటం.. ఇంటి భోజనం చేయడం కన్నా సంతోషం ఏముంటుంది.. ఈ రాత్రికి ఇంటికి వెళుతున్నా.. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు'' అని పోస్టు చేశాడు.
కోహ్లీ డైట్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాడు. ఇండియన్ రన్ మెషిన్ గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ ఆయిల్, జంక్ లేదా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని అసలు తీసుకోడు. అయితే అమ్మ చేతి వంట విషయంలో విషయంలో మాత్రం కాస్తంత పట్టువిడుపు ప్రదర్శిస్తాడు.
కాగా ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న తొలి వన్డే నిమిత్తం కోహ్లీ ఇంటి నుంచి ధర్మశాల బయల్దేరుతున్నట్లు ట్వీట్ చేశాడు. 'ధర్మశాల వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకి బయల్దేరాను. సూర్యోదయం ఎంతో అందంగా ఉంది. అందరూ దీవించండి' అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా న్యూజిలాండ్‌పై 3-0తో సిరీస్‌ను దక్కించుకుని టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.