విరాట్ కోహ్ల ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో వరుస పెట్టి హాఫ్ సెంచరీలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు అర్ధశతకాలతో రాణించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ ఓటమికి అతని ఇన్నింగ్సే కారణం. అయితే ఇంత సూపర్ స్టార్ క్రికెటర్ అయినా కూడా కోహ్లీ కొన్ని విషయాల్లో చాలా సింపుల్‌గా ఉంటాడు.
ఈ క్రమంలోనే ఢిల్లీతో మ్యాచ్ తర్వాత ఆదివారాన్ని తమాషాగా ఎంజాయ్ చేశాడు. సోమవారం నాడు చెన్నైతో తలపడాల్సిన నేపథ్యంలో కొంత రిలాక్స్ అవ్వాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. దీని కోసం పిల్లల ఇండోర్ పార్క్‌కు వెళ్లి అక్కడ ఆటలు ఆడుకుంటూ గడిపాడు. దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. ఈ ఫొటోలకు 'దిల్ తో బచ్చా హై జీ' (మనసు చిన్న పిల్ల వంటిదండీ) అని క్యాప్షన్ తగిలించాడు.

ఈ ఐపీఎల్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఇప్పటి వరకు నాలుగు మ్యాచుల్లో 147 స్ట్రైక్ రేటుతో 214 పరుగులు చేశాడు. మరో 162 పరుగులు చేస్తే ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి సారి 7 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటాడిగా రికార్డు సృష్టించేందుకు రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్ చూస్తుంటే ఈ రికార్డును చాలా ఈజీగా చేరుకునేలా ఉన్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తవగానే అవుటవడంపై మ్యాచ్ అనంతరం కోహ్లీ మాటలు వింటే ఈ విషయం అర్థం అవుతుంది.
'నేను తర్వాతి 10 బంతుల్లో 30-35 పరుగులు చేయాలని అనుకున్నా. కానీ ఇలా ఫుల్ టాస్‌కు అవుటైనందుకు చిరాకేసింది. నేను ఎప్పుడైనా కావాలంటే 230 స్ట్రైక్ రేటుతో ఆడగలను. కానీ పరిస్థితికి తగ్గట్లు ఆడాలి కదా. ఈ విషయం మైదానంలో లేని వాళ్లకు అర్థం కాదు. ఈ ఫార్మాట్‌లో కూడా యాంకర్ పాత్ర చాలా కీలకం అని అర్థం చేసుకోవాలి. అవసరమైతే ఇన్నింగ్స్ వేగాన్ని పెంచడం పెద్ద కష్టం కాదు' అని చెప్పాడు. ఇదే ఐడియాతో కనుక కోహ్లీ ఆడితే ఈజీగా భారీ స్కోర్లు చేసేస్తాడు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.