Virat Kohli: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అనంతరం టీమిండియాలోకి తిరిగి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీకి ఈ పునరాగమనం ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా డీఎల్ఎస్ పద్ధతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో అందరూ ఉత్సాహంగా ఎదురుచూసిన విరాట్ కోహ్లీ ప్రదర్శన పూర్తిగా నిరాశపరిచింది. కేవలం 8 బంతులు మాత్రమే ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఖాతా కూడా తెరవకుండానే.. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని ఆడబోయి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో కూపర్ కోనోలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
స్టార్క్ వ్యూహమే కోహ్లీ పతనానికి కారణం: మాజీ కోచ్ విశ్లేషణ
భారత జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ విరాట్ కోహ్లీ ఔటైన తీరును విశ్లేషిస్తూ.. ఈ మ్యాచ్‌లో స్టార్క్ కోహ్లీ కంటే ఒక అడుగు ముందుండి ఆలోచించాడని అభిప్రాయపడ్డారు. స్టార్క్ తన సాధారణ శైలికి భిన్నంగా వ్యూహాత్మకంగా బౌలింగ్ చేశాడని అభిషేక్ నాయర్ వివరించారు. స్టార్క్ సాధారణంగా ఫుల్లర్ లెంగ్త్‌లో, వేగవంతమైన బంతులు వేయడానికి ప్రసిద్ధి చెందగా.. ఈసారి మాత్రం పిచ్‌ను తాకుతూ బంతిని కోహ్లీకి దూరంగా వెళ్లేలా వేశాడు. "ఇది విరాట్‌పై స్పష్టమైన ప్రణాళిక. అతను ప్రసిద్ధి చెందిన ఫుల్, వేగవంతమైన బంతులు వేయలేదు. బంతిని పిచ్‌పై కొట్టి, బ్యాటర్‌కు దూరంగా వెళ్లేలా చేశాడు. వేగం, యాంగిల్‌లో వైవిధ్యం చూపడం ముఖ్యం" అని అభిషేక్ నాయర్ వెల్లడించారు.

ఆఫ్ స్టంప్ బలహీనత మళ్లీ బహిర్గతం
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఆఫ్ స్టంప్‌కు వెలుపల వెళ్లే బంతులపై విరాట్ కోహ్లీ బలహీనత మరోసారి స్పష్టంగా బయటపడింది. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడినప్పుడు కూడా కోహ్లీ ఇదే తరహాలో పదేపదే ఔటయ్యాడు. అభిషేక్ నాయర్ ఈ లోపాన్ని ఎత్తిచూపుతూ.. కోహ్లీ తన వీడియోలు చూసుకుని త్వరలో మెరుగుపరుచుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. "బహుశా బ్యాక్‌ఫుట్‌పై ఉండి ఆడటం లేదా బంతిని ఆలస్యంగా థర్డ్ మ్యాన్ దిశగా ఆడటం అతనికి సరైనదిగా ఉంటుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో కోహ్లీ దీనిపై పని చేయడం మనం చూశాం. కోహ్లీ అద్భుతమైన పునరాగమనం చేస్తాడని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను" అని ఆయన తేల్చి చెప్పారు.
ప్రస్తుతం వన్డే కెరీర్‌పై కొంత అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ మిగిలిన మ్యాచ్‌లలో భారీ ఇన్నింగ్స్‌లు ఆడి తన ఫామ్‌ను, విశ్వాసాన్ని తిరిగి పొందడం చాలా అవసరం. పెర్త్ వన్డేలో రోహిత్ శర్మ (8 పరుగులు) కూడా విఫలమయ్యాడు. భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ అక్టోబర్ 23 (గురువారం) నాడు అడిలైడ్ ఓవల్‌లో జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా తమ సత్తా చాటి, జట్టు విజయంలో భాగస్వామ్యులై, అభిమానుల ఆశలను నిలబెట్టాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.