
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలకమైన క్యాచ్ జారవిడిచాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా సారధి ప్యాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బౌలింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం దక్కింది. తను వేసిన తొలి బంతికే ఉస్మాన్ ఖవాజాను సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో రెండు పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మహమ్మద్ షమీ సూపర్ డెలివరీతో వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
కేవలం రెండు పరుగుల స్కోరు వద్దనే ఓపెనర్లు ఇద్దర్నీ కోల్పోయిన ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ (15 నాటౌట్) మరో వికెట్ పడనివ్వలేదు. అతనితోపాటు మార్నస్ లబుషేన్ (32 నాటౌట్) కూడా క్రీజులో కుదురుకున్నాడు. ఇలాంటి సమయంలో స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ జారవిడవడం వైరల్‌గా మారింది. అక్షర్ పటేల్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ బలంగా బాదేందుకు స్మిత్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి తక్కువ ఎత్తులో వేగంగా స్లిప్స్ వైపు వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వేగంగా రియాక్ట్ అయ్యాడు. రెండు చేతులతో దాన్ని అందుకునే సమయం లేకపోవడంతో ఒంటి చేత్తో క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. అయితే వేగంగా, స్పిన్ అవుతూ వచ్చిన ఆ బంతి అతని చేతి నుంచి జారిపోయింది. దీంతో స్మిత్ బతికిపోయాడు.
ఇది చూసిన ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. కోహ్లీ మంచి ఫీల్డరే కానీ.. స్లిప్స్‌లో రహానేను మించిన ఫీల్డర్ మరొకరు ఉండరని అంటున్నారు. ఇలా లైఫ్ దక్కిన తర్వాత స్మిత్ కనుక భారీ స్కోరు చేస్తే కోహ్లీనే తప్పుబడతారని నెటిజన్లు కూడా అంటున్నారు. మరి స్మిత్ ఎంత స్కోరు చేస్తాడో చూడాలి.