
హైదరాబాద్: వన్డే క్రికెట్ కెరీర్‌లో 35వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ఈ సెంచరీతో పాటుగా వన్డే మ్యాచ్‌ను గెలివడంతో సిరీస్ చేజిక్కింది. ఐదో వన్డే మ్యాచ్‌కే సిరీస్ కైవసం చేసుకున్నా.. ఆఖరు మ్యాచ్ సైతం విజయంతోనే ముగించాలని కోహ్లీ ముందే పేర్కొన్నాడు. అన్నట్లుగానే టార్గెట్ ను అలవోకగా చేధించి జట్టును విజయం వైపుకు నడిపించాడు
అయితే ఈ క్రెడిట్ అంతా సతీమణి అనుష్క శర్మకే దక్కుతుందంటూ పొగడ్తలన్నీ ఆమెకే ఆపాదిస్తున్నాడు కోహ్లీ. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'క్రీడాకారులు ఆడటానికి స్టేడియం బయట ఉన్న వ్యక్తులు ఇచ్చే ప్రేరణ చాలా విలువైనది. అలానే నా భార్య నాకిచ్చిన ప్రేరణతో ఈ గొప్పదనమంతా తనకే దక్కాలి' అని పేర్కొన్నాడు.
'ఇంకా కెరీర్ కొనసాగించడానికి 8-9 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ కాస్త వ్వవధిలో జట్టు కోసం నేను 120% కష్టపడతాను. దేవుడి దయతో నేను ఆరోగ్యంగానే ఉన్నాను' అని వివరించాడు.
స్పిన్నర్లు అద్భుతం
సిరీస్ విజయంలో కీలక పాత్ర పొషించిన ఇద్దరు యువ స్పిన్నర్లును కోహ్లి కొనియాడాడు. 'వారిద్దరు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా జోహన్నెస్‌బర్గ్ టెస్టు అనంతరం వారు జట్టులోకి వచ్చారు. అప్పటి నుంచి మా విజయ యాత్ర కొనసాగించాం. తొలి రెండు టెస్టుల ఓటమితో నిరాశ చెందాం. చివరి టెస్టు విజయానంతరం ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. టెస్టు సిరీస్ కోల్పోయినప్పుడు ఇక్కడే మీతోనే మాట్లాడా.. ఇప్పుడు వన్డే సిరీస్ గెలిచి మళ్లీ మీతోనే మాట్లాడుతున్నా. ఇది అత్యద్భుతమని 'కోహ్లి వ్యాఖ్యానించాడు.
ఇంకా సిరీస్ అయిపోలేదని, టీ20 సిరీస్‌ను సైతం వదులుకోమని స్పష్టం చేశాడు. ఇక మూడు టీ20ల సిరీస్ ఆదివారం జోహన్నెస్ బర్గ్ వేదికగా ప్రారంభం కానుంది.