IND vs NZ: న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వన్డేలో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ..స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వీరోచిత సెంచరీతో(124 పరుగులు) రికార్డుల దుమ్ముదులిపాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా కోహ్లీ క్రికెట్ దిగ్గజాల పేరిట ఉన్న నాలుగు కీలక రికార్డులను అధిగమించి వన్డే క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.
విరాట్ కోహ్లీ అధిగమించిన ఆ 4 ప్రధాన రికార్డులు ఇవే..!
1. నంబర్ 3 స్థానంలో అత్యధిక పరుగులు .. పాంటింగ్ రికార్డు బ్రేక్
వన్డే క్రికెట్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సాధించిన పరుగులతో కోహ్లీ తన ఖాతాలో 12,676 పరుగులు (244 ఇన్నింగ్స్‌లలో) చేర్చుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (12,662 పరుగులు - 330 ఇన్నింగ్స్‌లలో) పేరిట ఉన్న సుదీర్ఘకాలపు రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.

2. కివీస్‌పై అత్యధిక ఇంటర్నేషనల్ సెంచరీలు.. సచిన్ రికార్డు బ్రేక్
అన్ని ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కలిపి న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. తాజా సెంచరీతో కివీస్‌పై కోహ్లీ సెంచరీల సంఖ్య 10కి చేరింది. గతంలో 9 సెంచరీలతో ఉన్న సచిన్ టెండూల్కర్, జాక్వెస్ కాలిస్, జో రూట్‌లను విరాట్ వెనక్కి నెట్టాడు.
3. విభిన్న వేదికలపై అత్యధిక వన్డే సెంచరీలు
ప్రపంచవ్యాప్తంగా వివిధ స్టేడియాల్లో సెంచరీలు సాధించి విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇండోర్ శతకం విరాట్ కోహ్లీ కెరీర్‌లో 35వ భిన్నమైన వేదికపై చేసిన సెంచరీ. దీనితో సచిన్ టెండూల్కర్ (34 వేదికలు) రికార్డును కోహ్లీ అధిగమించాడు. రోహిత్ శర్మ 26 వేదికలతో మూడో స్థానంలో ఉన్నాడు.
4. న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే సెంచరీలు
వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇది కివీస్‌పై విరాట్ కోహ్లీకి 7వ వన్డే సెంచరీ. గతంలో చెరో 6 సెంచరీలతో ఉన్న రికీ పాంటింగ్, వీరేందర్ సెహ్వాగ్‌లను విరాట్ దాటేశాడు.
మ్యాచ్ ఫలితం భారత్‌కు అనుకూలంగా రాకపోయినా, కోహ్లీ మాత్రం 'రన్ మెషీన్' అని మరోసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా 60కి పైగా సగటుతో నంబర్ 3 స్థానంలో కోహ్లీ కొనసాగిస్తున్న ఫామ్ అద్భుతమని క్రికెట్ విశ్లేషకులు కొనియాడుతున్నారు.