ఉప్పల్ మ్యాచ్ టికెట్లా? హోమ్ లోన్ ఈఎంఐలా?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్టేడియంలోకి అడుగుపెడుతున్నాడంటే చాలు.. స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోవడం ఖాయం. పైగా ఈసారి ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లోనే అజేయ సెంచరీతో చెలరేగి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కింగ్ కోహ్లీ విశ్వరూపాన్ని కళ్లారా చూసేందుకు హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులకున్న ఈ క్రేజ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమకు అనుకూలంగా మార్చుకుని భారీగా సొమ్ము చేసుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నెల 22న ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ టికెట్ల ధరలను ఫ్రాంచైజీ అమాంతం పెంచేసింది. ప్రస్తుతం టోర్నమెంట్లో ప్లేఆఫ్స్ రేసు క్లైమాక్స్‌కు చేరడం ఈ మ్యాచ్‌కు మరింత హైప్ తెచ్చింది. ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకున్న ఆర్సీబీ.. టాప్-2లో నిలిచేందుకు, అలాగే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకునేందుకు ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం కానుంది. దీంతో ఈ మ్యాచ్ టికెట్లకు మార్కెట్లో ఊహించని రీతిలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్లో టికెట్ల విక్రయాలు ప్రారంభించగా.. అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. టికెట్ల బుకింగ్ యాప్‌లో దాదాపు 4 లక్షల మంది క్యూలైన్లో వేచి ఉండటం గమనార్హం. నిజానికి ఉప్పల్ స్టేడియం మొత్తం సామర్థ్యం కేవలం 39,000 మాత్రమే. కానీ అందుబాటులో ఉన్న సీట్ల కంటే ఎన్నో రెట్లు అదనంగా అభిమానులు టికెట్ల కోసం పోటీ పడ్డారు. అయితే లోపలికి వెళ్లి టికెట్ ధరలను చూసిన సగటు క్రికెట్ ప్రేమికుడికి తీవ్ర నిరాశే ఎదురైంది. మునుపటి మ్యాచ్‌లతో పోలిస్తే ఈసారి రేట్లను ఏకంగా 20 నుంచి 30 శాతం వరకు పెంచేశారు.
సన్‌రైజర్స్ యాజమాన్యం ఈ మ్యాచ్‌కు కనిష్ట టికెట్ ధరను రూ.1,950గా.. గరిష్ట ధరను ఏకంగా రూ.45,000గా నిర్ణయించింది. సౌత్ రెండో అంతస్తులోని కార్పొరేట్ బాక్సు టికెట్ ధర రూ.45,000 పలకడం విశేషం. అలాగే వెస్ట్ రెండో అంతస్తు కార్పొరేట్ బాక్సు ధర రూ.30,000గా, ఆరెంజ్ ఆర్మీ ఈస్ట్, వెస్ట్ లాంజ్‌ల ధరను రూ.20,000గా నిర్ణయించారు. సాధారణ ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే ఈస్ట్, వెస్ట్ స్టాండ్ల ఫస్ట్ ఫ్లోర్ ధర రూ.4,500 కాగా, గ్రౌండ్ ఫ్లోర్ ధరను రూ.6,000కు పెంచేశారు. నార్త్ స్టాండ్ రెండో టెర్రస్‌లో లభించే రూ.1,950 టిక్కెట్టే అన్నింటికంటే తక్కువ ధర కావడం గమనార్హం.
ఈ కనిష్ట, గరిష్ట ధరల మధ్యలో సీట్ల కేటగిరీని బట్టి రూ.2,050, రూ.3,250, రూ.3,500, రూ.4,500, రూ.6,000, రూ.9,000, రూ.10,000, రూ.12,000, రూ.13,000, రూ.20,000, రూ.30,000, రూ.40,000 చొప్పున భారీ రేట్లను ఖరారు చేశారు. ఇంతలా ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపినప్పటికీ, కోహ్లి ఆటను చూసేందుకు ఉన్న పిచ్చితో అభిమానులు వెనకాడలేదు. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం కొన్ని గంటల్లోనే ఉప్పల్ స్టేడియం టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయినట్లు టికెటింగ్ యాప్‌లో కనిపించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications