
మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ.. కీలక మ్యాచుల్లో తేలిపోతున్నాడు. తడబడుతున్నాడు. ప్రత్యేకించి- ప్రపంచకప్ టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌లంటే విరాట్ కోహ్లీ ఎందుకో ఒత్తిడికి గురవుతున్నాడనే విషయం ఇక్కడ మరోసారి తేటతెల్లమైంది. ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్‌లో కోహ్లీ ఆరు బంతులను ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేశాడు. పెవిలియన్ దారి పట్టాడు. తన బ్యాచ్‌మేట్ ట్రెంట్ బౌల్ట్ చేతిలో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ప్రపంచకప్ నాకౌట్ లేదా సెమీఫైనల్ మ్యాచుల్లో విఫలం కావడం విరాట్ కోహ్లీకి కొత్తేమీ కాదు. ప్రస్తుత ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌ను కలుపుకొని ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ ఆరు నాకౌట్ మ్యాచ్‌లను ఆడాడు. ఈ ఆరింట్లో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ భారీ స్కోరును నమోదు చేయలేదు. ఈ ఆరు మ్యాచుల్లో అతని అత్యధిక స్కోరు 35 మాత్రమే. 49 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఆరు నాకౌట్ మ్యాచుల్లో వరుసగా 24, 9, 35, 3, 1, 1 పరుగులు చేశాడతను. మొత్తం 73 పరుగులు. సగటున 12.16 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 56.15.
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ పేక మేడను తలపించింది. ఇప్పటిదాకా కొదమ సింహాల్లా ఆడుతూ వచ్చిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అయ్యారు. మూడు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది టీమిండియా. అయిదో స్థానంలో వచ్చిన దినేష్ కార్తిక్ సైతం విఫలం అయ్యాడు. 25 బంతులను ఎదుర్కొన్న దినేష్ కార్తిక్ ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు.