హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. వన్డేల్లో విజయవంతమైన ఛేజింగ్‌ల్లో నాలుగువేల పరుగుల మార్కును అందుకున్న మూడో క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.
అంతకుముందు సచిన్ టెండూల్కర్ (5,490), రికీ పాంటింగ్(4,186)లు మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ ఘనతను సాధించే క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజి 100.02గా ఉండటం విశేషం. ఇక, సచిన్ 55.45 యావరేజితో, రికీ పాంటింగ్ 57.34 సగటుతో మాత్రమే ఈ ఘనతను సాధించారు.
దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. తద్వారా నాలుగు వేల పరుగుల విజయవంతమైన ఛేజింగ్ క్లబ్‌లో కోహ్లీ చేరిపోయాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 28 వన్డే సెంచరీలున్నాయి.
అందులో ఛేజింగ్ చేసే క్రమంలో విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీలు 18. ఇందులో 16 సెంచరీలు టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాయి.
ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని కోహ్లీసేన 28.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో శ్రీలంకపై టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఓపెనర్ శిఖర్ ధావన్ (132 నాటౌట్) చెలరేగగా, కెప్టెన్ కోహ్లీ (82 నాటౌట్) పరుగులతో టీమిండియాకు ఘన విజయాన్నందించారు. 71 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో ధావన్ సెంచరీ పూర్తి చేయడంతో శ్రీలంకలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా ధావన్ చరిత్ర సృష్టించాడు.
తొలుత ఓపెనర్ రోహిత్ శర్మ 4 పరుగుల వద్ద రనౌటయ్యాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌటైంది.