హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీపై పలువురు మాజీ క్రీడాకారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విచిత్రమైన కామెంట్ చేశాడు.
విరాట్ మన గ్రహానికి చెందినవాడు కాదని, ఇంకా ఎవరూ కనిపెట్టని గ్రహం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాడని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం కోహ్లీ ఆటతీరు ఎంతో అత్యుత్తమంగా ఉందని అసలు అతని గురించి ఎలా చెప్పాలో కూడా తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నాడు.

కోహ్లీ డబుల్ సెంచరీ, టెస్టుల్లో మూడోది: 9వ స్థానంలో దిగి జయంత్ సెంచరీ
రోజురోజుకు కోహ్లీ ఎంతో పరిణితి చెందిన ఆటగాడిగా రాణిస్తున్నాడని ప్రశంసల వర్షం కురిపించాడు. 'వన్డే, టెస్టులు, టీ20లు, ఐపీఎల్ ఇలా ఫార్మాట్ తో సంబంధం లేకుండా కోహ్లీ దూసుకుపోతున్నాడు. భారత్ బ్యాటింగ్‌కు అతడు వెన్నెముక లాంటివాడు. కెప్టెన్‌గా అతడు ఇంకా చాలా చిన్నవాడు. రోజు ఏదో ఒక విషయాన్ని అతడు నేర్చుకోవడం మంచిది. ముంబై స్డేడియంలో చివరి రోజు 150 స్కోరు ఛేదించడం అంత ఈజీ కాదు' అని అన్నాడు.
భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. కోహ్లీ 302 బంతుల్లో 23 ఫోర్‌లతో 200 పరుగులు చేశాడు. కోహ్లీకి టెస్టుల్లో ఇది మూడో డబుల్ సెంచరీ. కోహ్లీ దూకుడైన ఆటతో భారత్ 158 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముంబైలో కోహ్లీ పలు రికార్డులు సాధించాడు.
సునీల్ గవాస్కర్ తర్వాత ఒక సిరీస్‌లో 500 పై చిలుకు పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ ఏడాదిలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకొని, ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. మూడు ఫార్మాట్లలోను 50కి పైగా సగటు అందుకొని ఈ మార్కు దాటిన ఏకైక ఆటగాడిగా రికార్డుకెక్కాడు. టెస్టుల్లో 4వేల పరుగుల మైలురాయి దాటాడు.