
హైదరాబాద్: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య నాలుగో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు 37.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది.
దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ 224 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై వన్డే ముగిసిన అనంతరం టీమిండియా ఈ సిరిస్‌లో ఆఖరి వన్డే కోసం మంగళవారం కేరళలోని తిరువనంతపురానికి బయల్దేరింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో భారత క్రికెటర్లు అక్కడ విమానం కోసం కాసేపు వేచి ఉండాల్సి పరిస్థితి తలెత్తింది. దీంతో జట్టులోని కొంత మంది ఆటగాళ్లు కలిసి ఎయిర్‌పోర్ట్‌లోనే సీరియస్‌గా ఓ గేమ్ ఆడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోని బీసీసీఐ తాజాగా ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. అయితే క్రికెటర్లు ఆడే గేమ్ ఏదో చెప్పకుండా అభిమానులే ఊహించాల్సిందిగా ట్వీట్ చేసింది.
దీంతో పలువురు నెటిజన్లు.... క్రికెటర్లు ఆడుతున్న గేమ్ ఏంటో ఊహించారు. ఈ గేమ్ పేరు PUBG (Player Unknown Battlegrounds) అని, యుద్ధానికి సంబంధించిన గేమ్‌గా పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో మొబైల్‌లో బాగా పాపులర్ అయిన గేమ్ ఇదేనని తమ తమ ట్వీట్లలో తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
కాగా, ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే నాలుగు వన్డేలు ముగియగా.. టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, విశాఖలో జరిగిన రెండో వన్డే టైగా ముగిసింది. పుణెలో జరిగిన మూడో వన్డేలో విండీస్ విజయం సాధించగా, తాజా వన్డేను భారత్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే తిరువనంతపురం వేదికగా నవంబరు 1న జరగనుంది.