

న్యూ ఢిల్లీ: పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఆటతోనే కాదు. సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ అభిమానులను పలకరిస్తూనే ఉంటాడు. ఏ మ్యాచ్‌లు లేకపోతే కుటుంబంతో సరదాగా గడిపేసే కోహ్లీ.. ఆసియా కప్ టోర్నీకి దూరం కావడంతో ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని అతని సొంత రెస్టారెంట్‌లో కుటుంబంతో కలిసి డిన్నర్ చేశాడు. ఆ ఫొటోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు కోహ్లీ.
ఆ ఫోటోను పోస్టు చేసిన కోహ్లీ దాని కింద 'ఇవాళ లంచ్ @nueva.worldలో చాలా బాగా జరిగింది. లంచ్‌లో స్నేహితులం కలసి పాల్గొనడం సంతోషంగా అనిపించింది. మా లాంటి ఫుడ్ లవర్స్‌కు ఇది చాలా మంచి ప్రదేశం. ఇక్కడి చించురీ మష్‌రూమ్స్ వంటను మిస్ కాకండి' అంటూ ట్వీట్ చేశాడు. అతని సొంత రెస్టారెంట్ ప్రమోషన్ సగమైతే మరి కొంత అతని సంతోషం ఆ ట్వీట్‌లో కనిపిస్తున్నాయి.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో 84రోజుల పాటు జరిగిన సుదీర్ఘ పర్యటన అనంతరం విరామం తీసుకుంటున్నాడు. గత ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైన కోహ్లీ ఇటీవల ఇంగ్లీషు గడ్డపై ఐదు టెస్టుల్లో 593 పరుగులు చేశాడు. ఇతని పూర్తి కెరీర్‌లో 71 టెస్టుల్లో 6147పరుగులు అందులో 23 సెంచరీలు చేయగలిగాడు. వన్డేల విషయానికొస్తే 211వన్డేలు ఆడి 9779పరుగులు చేశాడు.
ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్న టీమిండియా కోహ్లీ లేకుండా టోర్నీ ఆడుతోంది. అయితే టోర్నీకి ముందు కోహ్లీ లేకుండా భారత్ ఎంతవరకూ రాణించగలదో అనే అనుమానాలు వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు సైతం కోహ్లీ లేకపోతే టీఆర్పీ రేటింగ్‌లు తగ్గిపోతాయంటూ బీసీసీఐ ఎంపికపై విమర్శలు గుప్పించారు. వాటన్నటికీ ధీటుగా 'అందుబాటులో ఉన్నవారిని జట్టులోకి తీసుకుని అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తాం. ఎవరిని ఎంపిక చేయాలో బీసీసీఐకు సూచించాల్సిన అవసర్లేదు' అని తెలిపింది.