WTC21: Virat Kohliనే టాప్.. ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు! రోహిత్ ఖాతాలో కూడా!!

సౌథాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు సౌథాంప్టన్ వేదికగా తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అయితే ఈ సారి తన ఆటతో కాకుండా.. కెప్టెన్సీతో సరికొత్త ఫీట్‌ను అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియాకు అత్యధిక మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలయింది.

ధోనీ రికార్డు బద్దలు:
ఇప్పటివరకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో సమానంగా 60 టెస్ట్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు విరాట్ కోహ్లీ. ఈరోజు సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌తో కోహ్లీ.. 61వ టెస్ట్‌లో టీమిండియాకు సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో మహీ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. భారత్ తరఫున 60 టెస్టులకి కెప్టెన్సీ వహించాడు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత టెస్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ.. అతడినే అధిగమించాడు. టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గానూ విరాట్ తొలి స్థానంలో ఉన్నాడు. 61 టెస్ట్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించి 36 మ్యాచ్‌లు గెలిపించాడు. మరో 14 మ్యాచ్‌లు ఓడిపోగా.. 10 మ్యాచ్‌లను డ్రాగా ముగించాడు.

గ్రేమ్ స్మిత్1:
క్రికెట్ ప్రపంచంలో అత్యధిక టెస్టులకి కెప్టెన్సీ వహించిన క్రికెటర్‌గా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఉన్నాడు. స్మిత్ 109 టెస్టులకి కెప్టెన్సీ వహించగా.. అతని తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ 93 టెస్టులతో ఉన్నాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), క్లయివ్ లాయిడ్ (వెస్టిండీస్) తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక ఆసియా పరంగా చూస్తే మాత్రం విరాట్ కోహ్లీనే టాప్. కోహ్లీ, ధోనీ తర్వాత స్థానాల్లో శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ 56 టెస్టులతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు:
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు ప్రారంభ ఐసీసీ ఈవెంట్ ఫైనల్స్‌లో పాల్గొన్న మొదటి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ ఘనత అందుకున్న తొలి ఆటగాడు అతడే కావడం విశేషం. డబ్ల్యూటీసీ ఫైనల్ 2021తో పాటు 2007 టీ20 ప్రపంచకప్‌లోనూ రోహిత్ ఆడాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తుది పోరులో 16 బంతుల్లోనే 30 పరుగులు చేసి జట్టుకు ఉపయుక్తమైన స్కోరు అందించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇప్పటికి 34 రన్స్ చేశాడు.

నిలిచిపోయిన మ్యాచ్:
వెలుతురు లేమి కారణంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ రెండో రోజు ఆట నిలిచిపోయింది. ఆకాశం మేఘావృతమవడంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. అప్పటికి భారత్ స్కోరు 64.4 ఓవర్లలో 146/3గా నమోదైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (44; 124 బంతుల్లో 1x4), అజింక్య రహానే (29; 79 బంతుల్లో 4x4) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు కూడా వెలుతురు లేమి కారణంగా కాసేపు మ్యాచ్ ఆగిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications