గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి చెందడం బాధేస్తోంది: కోహ్లీ


హైదరాబాద్: గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా బాధేస్తోందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ భారత ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.
"వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా మంచు గురించి మా అంచనా తప్పయింది. మంచు వల్ల చివర్లో మా బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదు. అయితే దీనిని మా ఓటమికి సాకుగా చెప్పను. ఆఖరి ఓవర్లలో ఐదు అవకాశాలు వృథా కావడం జీర్ణించుకోలేనిది. స్టంపింగ్ అవకాశం చేజారింది. ఫీల్డింగ్ బాగా లేదు. డీఆర్‌ఎస్‌ను సందేహించాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చింది" అని కోహ్లీ చెప్పాడు.

టర్నర్ అద్భుత ప్రదర్శన
"అస్టన్ టర్నర్, ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ల అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ప్రత్యర్ధి జట్టు మా కన్నా బాగా ఆడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల ఫలితాలతో మా కళ్లు తెరచుకున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం మరో మాటకు తావు లేకుండా మమ్మల్ని చాలా బాధపెడుతోంది" అని కోహ్లీ వెల్లడించాడు.

358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ
మొహాలి వేదికగా ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో 358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 359 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇంకా 13 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం అయింది. సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది.

మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన టర్నర్
ఆసీస్ ఆటగాడు ఆస్టన్ టర్నర్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ (0), షాన్ మార్ష్ నిరాశపరిచినా.. హ్యాండ్స్‌కబ్ (117), ఉస్మాన్ ఖవాజా (91)ల జోడీ మూడో వికెట్‌కి అభేద్యంగా 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఆకాశమే హద్దుగా చెలరేగిన టర్నర్
అటు తర్వాత మ్యాక్స్‌వెల్(23) బ్యాట్ ఝుళిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన టర్నర్ బౌండరీల లక్ష్యంగా విజృంభించాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టర్నర్ భారీ హిట్టింగ్‌తో మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు.

టర్నర్ స్టంపింగ్‌ను వదిలేసిన రిషబ్ పంత్
ఈ మ్యాచ్‌లో ధోని స్థానంలో వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో టర్నర్ స్టంపింగ్‌ను వదిలేయగా.. కేదార్ జాదవ్, శిఖర్ ధావన్ సులువైన క్యాచ్‌లు జారవిడవడం అతడికి బాగా కలిసొచ్చింది. అంతకముందు ఓపెనర్లు శిఖర్ ధావన్ (143), రోహిత్ శర్మ (95) అద్భుత ప్రదర్శన చేయడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications