న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్రాంఛైజీల కొనుగోళ్లతో జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్ జట్టు గోవా ఫుట్‌బాల్ క్లబ్ సహయాజమానిగా కొనసాగుతున్న కోహ్లీ.. మరో లీగ్‌లో ఓ జట్టును సొంతం చేసుకున్నాడు.
తాజాగా ప్రో రెజ్లింగ్ లీగ్(పీడబ్యూఎల్) ఫ్రాంఛైజీ బెంగళూరు యోధాస్ సహయాజమానిగా వ్యవహరించనున్నాడు కోహ్లీ. దేశవ్యాప్తంగా నగరాలు కేంద్రంగా ఉండే ఆరు జట్లు ఈ లీగ్‌లో తలపడనున్నాయి.

ప్రతీ జట్టులో తొమ్మిది మంది క్రీడాకారులుంటారు. ప్రొ రెజ్లింగ్ జట్టు యూపీ వారియర్స్‌కు భారత్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా సహయాజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ రెండు జట్లు బెంగళూరు యోధాస్, యూపీ వారియర్స్ శుక్రవారం పోటీపడనున్నాయి.
ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. తొలి సారిగా ప్రో రెజ్లింగ్ లీగ్, బెంగళూరు యోధాస్ గురించి విని ఆశ్చర్యపోయానన్నాడు. అంతేగాక, తాను బెంగళూరు నగరానికి కొత్తేమికాదని ఈ బంధాన్ని ఇలాగే కొనసాగించడానికి ఫ్రాంఛైజీని ఎంచుకున్నట్లు కోహ్లి పేర్కొన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కోహ్లీ కెప్టెన్ కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా, 'స్పోర్ట్స్ కాన్వో' పేరుతో సామాజిక మాద్యమం ఆధారంగా నడిచే స్టార్టప్ వ్యాపారాన్ని కోహ్లి ప్రారంభించిన విషయం తెలిసిందే.