Virat Kohli: టీమిండియా రన్ మెషీన్‌గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు తన శిక్షణను ప్రారంభించాడు. టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ కోహ్లీ కేవం వన్డే, ఐపీఎల్‌పై మాత్రమే దృష్టి సారిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధమయ్యే క్రమంలో కోహ్లీ తన ప్రాక్టీస్‌ను లండన్‌లో మొదలుపెట్టాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ నయీమ్ అమీన్ పర్యవేక్షణలు కోహ్లీ ఈ శిక్షణ తీసుకున్నాడు.
కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
విరాట్ కోహ్లీ తన శిక్షణా సెషన్‌కు సంబంధించిన ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఆ పోస్టులో "సహాయం చేసినందుకు ధన్యవాదాలు బాయ్.. మిమ్మల్ని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది." అంటూ నయీమ్ అమీన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అమీన్ కూడా కోహ్లీ పోస్ట్‌ను తన అకౌంట్‌లో రీ-షేర్ చేస్తూ.. "మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది, బ్రదర్! త్వరలో మళ్లీ కలుద్దాం." అని పేర్కొన్నాడు.

కోచ్ నయీమ్ అమీన్ గురించి..
కోచ్ నయీమ్ అమీన్ బర్క్ షైర్, బకింగ్‌హామ్‌షైర్, లండన్‌లలో 'మైటీ విల్లో అకాడమీ'ని నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్‌లో కూడా పనిచేశారు. విరాట్ కోహ్లీతో పాటు భారత ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా గతంలో అమీన్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు.
కోహ్లీ ప్రస్తుత ఫోకస్ అండ్ కెరీర్ హైలైట్స్
కోహ్లీ తన టెస్ట్, టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్, ఐపీఎల్ మ్యాచ్‌లపైనే దృష్టి పెట్టాడు. ఇప్పటివరకు 302 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 14,181 పరుగులు సాధించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 43 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ తొలి ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
రాబోయే మ్యాచ్‌లు
కోహ్లీ ఆటను చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారు అక్టోబర్ వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. వాస్తవానికి భారత్ ఆగస్టులో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. కానీ బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పరస్పర అంగీకారంతో ఈ సిరీస్‌ను సెప్టెంబర్ 2026 వరకు వాయిదా వేశారు.టెస్ట్, టీ20లకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీస్‌తో మళ్ళీ భారత జట్టులోకి రానున్నారు. ఈ సిరీస్ అక్టోబర్ 19, 23, 25 తేదీలలో పెర్త్ స్టేడియంలో ప్రారంభమవుతుంది.