న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తూ భారీ స్కోర్లు సాధిస్తూ భారత జట్టు సాధిస్తున్న విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను తెలియజేస్తూ గత కొన్నేళ్లుగా అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ముఖ్యంగా ఫిట్‌నెస్ పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నాడు. అయితే కోహ్లీ తన కెరీర్‌లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాడంటే అంతా తన మహిమేనని వివాదాస్పద బాబా రామ్ రహీమ్ గుర్మీత్ సింగ్ తన ఖాతాలో వేసుకున్నారు. తాను ఇచ్చిన టిప్స్ కారణంగానే కోహ్లీ ఈ స్థాయికి చేరాడని చెప్పారు.

'స్పాట్ బోయ్'కి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ కోహ్లీ బ్యాటింగ్‌ను మెరుగుపరచుకోడానికి తాను చేసిన సాయం గురించి చెప్పి అక్కడున్న వారందరినీ ఆశ్చర్య పరిచారు. ' మంచి ఆరంభం దక్కినా కోహ్లీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. అతడిని తీవ్రంగా కష్టపడాలని, నిరంతరం నేర్చుకుంటూనే ఉండమనే సలహా ఇచ్చాన'ని గుర్మీత్ సింగ్ తెలిపారు.
అంతేకాదు టీమిండియాలో విరాట్ కోహ్లీ చోటు దక్కించికున్నప్పుడు విరాట్ కోహ్లీ తనకు థాంక్స్ చెప్పాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే గుర్మీత్ సింగ్ క్రికెటర్లకు టిప్స్ ఇచ్చానని చెప్పుకోడవం ఇదే తొలిసారి కాదు.
గతంలో కూడా టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్‌లకు కూడా తాను విలువైన సూచనలు ఇచ్చినట్టు చెప్పారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పారు. అయితే బాబా గురించి తెలిసిన వారంతా ఇది పబ్లిసిటీ స్టంట్ అని విమర్శిస్తున్నారు.