
ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి కఠిన సమయంలో కూడా సాధారణ ప్రజానికానికి పోలీసులు చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఢిల్లీ పోలీసుల సేవలను గుర్తిస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ వీడియోలో మాట్లాడాడు. ఇషాంత్ శర్మ, జ్వాలా గుత్తా, అంజుబాబీ జార్జ్ వంటి క్రీడాకారుల వీడియో సందేశాలను పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
కోహ్లీ తన వీడియో సందేశంలో మాట్లాడుతూ... 'ఈ విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న పోలీసులు ఎంతో మందికి సాయమందిస్తున్నారని తెలిసి.. నా మనసు తరుక్కుపోతోంది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసుల సేవలు గుర్తించాలనుకుంటున్నా. వారు ఎంతో నిబద్ధతతో తమ విధులు నిర్వర్తించడమే కాకుండా అనేక మంది పేదల ఆకలి తీరుస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇలాగే కొనసాగించండ' అని కోహ్లీ అన్నాడు. కోహ్లీ ఇలా ప్రోత్సహించడం బాగుందని ఆయనకు ఢిల్లీ పోలీసులు ధన్యవాదాలు చెప్పారు. కరోనాపై పోరాటంలో భాగంగా ప్రజలను కాపాడడానికి ఏ అవకాశాన్నీ వదులుకోబోమన్నారు.
పేసర్ ఇషాంత్ శర్మ సైతం ఢిల్లీ పోలీసులను మెచ్చుకున్నాడు. 'పోలీసులకు సహకరిస్తూ అందరం ఇళ్లల్లోనే ఉందాం. ఎట్టిపరిస్థితుల్లోనూ వదంతులను నమ్మవద్దు. మనమంతా కలిసికట్టుగా ఈ మహమ్మారిపై విజయం సాధిద్దాం. అందరూ ఇప్పుడు ఇళ్లల్లో ఉండాల్సిన సమయం. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదించండి. వారిని జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్లు, ఢిల్లీ పోలీసులు, జవాన్లు మనకోసం రేయింబవళ్లు పనిచేస్తున్నారు' అని ఇషాంత్ పేర్కొన్నాడు.
జ్వాలా గుత్తా, అంజుబాబీ జార్జ్ కూడా పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. నిత్యం శ్రమిస్తున్న వారి సేవలను కొనియాడారు. అందరూ జాగత్తగా ఇంట్లోనే ఉండాలని కోరారు. భారత్‌లో శనివారం ఉదయానికి 7547 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 239 మంది మరణించారు. అలాగే డిల్లీలో అత్యధికంగా 900 కేసులు నమోదు కాగా.. 30 ప్రాంతాలను కరోనా హాట్‌స్పాట్లుగా గుర్తించారు.