కోచ్‌గా కుంబ్లేనే ఉండాలని కోరుకున్నాం... కానీ వద్దనుకున్నాడు: లక్ష్మణ్

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అప్పటి కోచ్ అనిల్ కుంబ్లేల వివాదంపై బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. టీమిండియా కోచ్‌గా అనిల్ కుంబ్లేనే కొనసాగించాలని తాము భావించామని, అయితే, అతడు మాత్రం వైదొలగాలనే నిర్ణయించుకున్నాడని లక్ష్మణ్ వెల్లడించాడు.
బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లోని మిగతా సభ్యులు సచిన్, సౌరవ్ గంగూలీ 2016లో కోచ్‌గా కుంబ్లేను ఎంపిక చేశారు. అయితే గతేడాది చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్ కోహ్లితో తలెత్తిన విభేదాల కారణంగా కోచ్ పదవి నుంచి కుంబ్లే తప్పుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోచ్‌గా కొనసాగేందుకు కుంబ్లే సుముఖత చూపలేదు.

వెస్టిండీస్ పర్యటన దాకా అతని పదవీ కాలం
వెస్టిండీస్ పర్యటన దాకా అతని పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశాడు. శుక్రవారం బెంగళూరు వేదికగా లక్ష్మణ్ ఆటో బయోగ్రఫీ ‘281 అండ్ బియాండ్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వీవీఎస్ లక్ష్మణ్ ఈ వ్యవహారమంతా తమ కమిటీకి చేదు గుళికను మిగిల్చిందని అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ హద్దు మీరి ప్రవర్తించలేదు
"ఈ వివాదంలో కోహ్లీ హద్దు మీరి ప్రవర్తించాడనుకోవడం లేదు. సీఏసీ మాత్రం కోచ్‌గా కుంబ్లేనే ఉండాలని కోరుకుంది. కానీ తను మాత్రం తప్పుకోవడమే సరైన నిర్ణయంగా భావించాడు. ఏదేమైనా సీఏసీకిది చేదు అనుభవం. మా పని మేం బాగానే చేశాం. బాగా కసరత్తు చేసే కోచ్‌ను ఎంపిక చేశాం" అని లక్ష్మణ్ అన్నాడు.

కమిటీ ఓ మ్యారేజ్ కౌన్సెలింగ్ సంస్థ కాదు
"మా కమిటీ ఓ మ్యారేజ్ కౌన్సెలింగ్ సంస్థ కాదని చాలా మందికి చెప్పా. మా పని కోచ్ పదవికి అర్హతలున్న వారిలో మెరుగైన వ్యక్తిని ఎంపిక చేయడమే. మేం చాలా విస్తృతంగా పని చేసి దానిని సమర్థంగా నిర్వర్తించాం. కానీ దురదృష్టవశాత్తు కోహ్లీ, కుంబ్లే మధ్య సమన్వయం కుదరలేదు" అని లక్ష్మణ్ చెప్పాడు.

కుంబ్లే రాకతో మంచి ఫలితాలు వచ్చినా
కుంబ్లే రాకతో మంచి ఫలితాలు వచ్చినా.. విరాట్ కోహ్లీతో మాత్రం భేధాభిప్రాయాలు తలెత్తాయి. మీడియాలో దీనిపై విస్తృతంగా కథనాలు రావడంతో కుంబ్లే పదవి నుంచి తప్పుకున్నాడు. అనంతం ఓ మీడియా సమావేశంలో కోహ్లీతో అభిప్రాయ భేదాలు ఉన్నట్లు అంగీకరిస్తూనే, వాటిని సరిదిద్దుకోవడం కష్టమని కుంబ్లే స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications