విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 90 ఓవర్ల ఆటలో ఛటేశ్వర పుజారా(119), కెప్టెన్ విరాట్ కోహ్లీ(151)లతో చెలరేగిపోయారు.
204 బంతులను ఎదుర్కొన్న ఛటేశ్వర పుజారా (119) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక 154 బంతుల్లో సెంచరీ సాధించిన కోహ్లీ 150 పరుగులను 238 బంతుల్లోనే సాధించాడు. 15 ఫోర్లు, 62.87 స్ట్రయిక్ రేట్‌తో ఉన్న కోహ్లీ రెండోరోజు డబుల్ సెంచరీ చేసే దిశగా దూసుకుపోతున్నాడు.
అయితే తొలిరోజు ఆటలో భాగంగా కెప్టెన్ కోహ్లీ... పుజారాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వికెట్ల మధ్య పరుగులు తీసేటప్పుడు ఇద్దరి మధ్య సమన్వయం లోపం కారణంగా పుజారా రెండు సార్లు రనౌట్ ప్రమాదంలో పడ్డాడు. దీంతో కోహ్లీ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తొలిరోజు జట్టు స్కోరు 6 పరుగుల వద్ద కేఎల్ రాహుల్(0), 22 పరుగుల వద్ద మురళీ విజయ్(20) అవుట్ కావడంతో కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ కోహ్లీ, పుజారాలు నిలదొక్కుకుని సెంచరీలు సాధించారు. వీరిద్దరూ కలిసి 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ క్రమంలో ఇంగ్లాడ్ స్పిన్నర్ రషీద్ వేసిన 18వ ఓవర్లో వేగంగా సింగిల్స్ తీస్తుండగా రెండు సార్లు రనౌట్ ప్రమాదం తలెత్తింది. మూడో బంతికి పుజారా రెండో పరుగు కోసం క్రీజు వదిలి రాగా కోహ్లీ నిరాకరించాడు. దీంతో పుజారా బ్యాట్ వదిలేసి వేగంగా వెనక్కి పరిగెత్తి చేతులు చాచి క్రీజులోకి డైవ్ చేశాడు.
స్వల్ప స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో నిలకడగా ఆడాల్సింది పోయి లేని పరుగు కోసం ప్రయత్నించిన ఛటేశ్వర పుజారాపై కోహ్లీ కోప్పడ్డాడు. ఇక తొలి రోజు కెప్టెన్ కోహ్లీ, పుజారాలు నిలదొక్కుకుని సెంచరీలు సాధించారు. తన టెస్టు కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న కోహ్లీ 14వ సెంచరీని నమోదు చేయగా, పుజారాకి ఇది పదో సెంచరీ.