మెల్బోర్న్: మెల్బోర్న్ టెన్నిస్ స్టేడియంలో గురువారం జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ సెమీ ఫైనల్ మ్యాచును భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ వీక్షించారు. ఈ మ్యాచులో సెర్బియన్ నొవాక్ జకోవిచ్, స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ తలపడ్డారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో శుక్రవారం (జనవరి 29)న ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచును ఆడనుంది.
అయితే గురువారం విరామం లభించడంతో కోహ్లీ, యువరాజ్ మెల్బోర్న్‌లో జరుగుతున్న టెన్నిస్ మ్యాచును తిలకించారు. స్వయంగా ఫెదరర్ అభిమాని అయిన కోహ్లీ.. యువరాజ్‌తో కలిసి స్టేడియంలో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పెట్టాడు.

అయితే, విరాట్ కోహ్లీకి నిరాశే మిగిలింది. ఎందుకంటే వరుస రెండు సెట్లలో జకోవిచ్ చేతిలో ఫెదరర్ ఓటమి చవిచూశాడు. 6-1, 6-2 తేడాతో ప్రపంచ నెంబర్ వన్ జకోవిచ్.. ఫెదరర్‌ను ఓడించాడు.
కాగా, జనవరి 2015లో తొలిసారి ఫెదరర్‌ను కలిసిన కోహ్లీ.. ఈ రోజును ఎప్పుడూ మరిచిపోను అని వ్యాఖ్యానించాడు. దిగ్గజానికి సెల్యూట్ అని పేర్కొన్నాడు.
అంతేగాక, అంతర్జాతీయ టెన్నిస్ ప్రీమియర్ లీగ్(ఐపిటిఎల్)లో యూఏఈ రాయల్స్ జట్టుకు కోహ్లీ సహయజమానిగా ఉన్నాడు. అదే జట్టు తరపున ఫెదరర్ టోర్నీలో పాల్గొన్నాడు. తాను ఫెదరర్‌కు పెద్ద అభిమానని, అతడు తమ జట్టులో ఆడటం మరింత ఆనందానికి గురిచేసిందని చెప్పాడు.