
179 పరుగుల లక్ష్యం..
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ మరోసారి విఫలం అయ్యాడు. తొమ్మిది పరుగులకే అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ-53, విరాట్ కోహ్లీ-62, సూర్యకుమార్ యాదవ్-51 పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌కు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ తడబడింది.

నెదర్లాండ్స్ కట్టడి..
లక్ష్యఛేదనలో ప్రారంభంలోనే చేతులెత్తేసింది. 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్లను కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ బ్యాటర్లెవరూ క్రీజ్‌లో నిలవలేకపోయారు. ఓపెనర్లు విక్రమ్‌జిత్ సింగ్-1, మ్యాక్స్ ఒడౌడ్-16, బాస్ డీ లీడె- 16, కొలిన్ అక్కెర్‌మన్ -17, టామ్ కూపర్ -9, కేప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్-5, టిమ్ ప్రింగిల్-20, లొగాన్ వాన్ బీక్-3, ఫ్రెడ్ క్లాసెన్-0 పరుగులు చేశారు. షరీజ్ అహ్మద్-16, పాల్ వాన్ మీకెరెన్-14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

సత్తా చాటిన బౌలర్లు..
టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించారు. ఒకే ఒక్క ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా మినహా మిగిలిన వారందరూ వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నారు. మహ్మద్ షమీ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 30వ తేదీన ఆడనుంది. దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. పెర్త్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

టీమిండియాను ఎదుర్కోవడం గొప్ప అనుభవం..
మ్యాచ్ ముగిసిన అనంతరం నెదర్లాండ్స్ కేప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడాడు. టీమిండియా బ్యాటింగ్ తీరుపై ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేకించి- విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌ల గురించి ప్రస్తావించాడు. వారిద్దరూ మ్యాచ్‌ను లాగేసుకున్నారని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ వంటి టోర్నమెంట్‌లో భారత్‌ను ఎదుర్కోవడం ఓ గొప్ప అనుభవమని పేర్కొన్నాడు. 180 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడం అనేది ఎప్పుడూ కష్టసాధ్యమేనని వ్యాఖ్యానించాడు.

పాకిస్తాన్‌తో..
తమ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారని, వికెట్లు పడనప్పటికీ.. భారత్ బ్యాటర్ల దూకుడును కొంత వరకు అడ్డుకున్నారని స్కాట్ ఎడ్వర్డ్స్ చెప్పాడు. భారీ స్కోర్ చేసే దిశగా వెళ్తోన్న టీమిండియాను 179 పరుగుల వద్ద అడ్డుకోగలిగామని పేర్కొన్నాడు. తమ తదుపరి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఉందని గుర్తు చేశాడు. టీమిండియాపై ఆడిన అనుభవంతో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటామంటూ స్కాట్ ఎడ్వర్డ్స్ ధీమా వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications












