ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు. అయితే సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ను భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. 1992 నుంచి దక్షిణాఫ్రికాలో భారత్ 8 టెస్టు సిరీస్‌లాడింది. కానీ ఏడింట్లో పరాజయం పాలైంది. ఓ సిరీస్‌ను మాత్రం డ్రాగా ముగించింది. ఈ సారి సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
అయితే ప్రపంచకప్ ఓటమి బాధ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గురించి టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు. ''అది గతం. ఎంతో నిరాశపరిచింది. కానీ దాన్ని అధిగమించి ముందుకు సాగాం. ఈ విషయంలో ఆటగాళ్లు గొప్పగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి మనం ఎంతో నేర్చుకున్నాం. ఔటైనా ప్రతీసారి బాధ పడుతుంటాం. తర్వాత మరో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. గతం మిగిల్చిన నిరాశలోనే మనం ఉండకూడదు. అలానే ఉంటే, తర్వాత మ్యాచ్‌లో దాని ప్రభావం ఎంతో పడుతుంది''.

''వారిద్దరు బాధపడ్డారు. అందరూ నిరాశ చెందారు. కానీ దాని నుంచి ముందుకు సాగిపోవాలి. మా ముందు ఇప్పుడు మరో కర్తవ్యం ఉంది. ఆటగాళ్లను ప్రేరేపించాలని నేను అనుకోను. జట్టులో సరైన వాతావరణం సృష్టించడం, మంచి ప్రాక్టీస్, శారీరకంగా, మానసికంగా, వ్యూహాత్మకంగా సిద్ధంగా ఉండటాన్ని నమ్ముతాను. భారత్‌కు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లకు ప్రేరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేశం కోసం సఫారీ గడ్డపై పోరాడాల్సి ఉంది'' అని ద్రవిడ్ అన్నాడు.
డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. చివరి టెస్టు కేప్‌టౌన్‌లో జనవరి 03న మొదలవుతుంది. అయితే తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం వల్ల తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే అవకాశముంంది. రెండో రోజు కూడా చాలా ఓవర్ల ఆట నష్టం జరగొచ్చు.