న్యూఢిల్లీ: ప్రపంచ కప్ టీ20 టోర్నీలో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన జరిగిన మ్యాచులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 'నా పేరును కాదు.. భారత్ అని నినదించండి' అంటూ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు సూచించాడు.
బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీని చూస్తూ అభిమానులు ' కోహ్లీ.. కోహ్లీ.. ' అంటూ నినాదాలు చేసి అమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు స్పందించిన కోహ్లీ.. 'కోహ్లీ.. కోహ్లీ కాదు, భారత్ అని అరవండి' అంటూ తన టీ-షర్టుపై రాసి ఉన్న 'ఇండియా'ను చూపిస్తూ అభిమానులకు సూచించాడు. కాగా, కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో బంగ్లాదేశ్‌పై భారత్ ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కోహ్లీ 24 పరుగులు చేశాడు.
కోహ్లీపై షారుక్ ప్రశంసలు
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీపై బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. మైదానంలోనూ, బయటా కోహ్లీ ప్రవర్తన చాలా బాగుంటుందని కొనియాడారు. బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ.. మంచి ప్రవర్తన గల కోహ్లీ అంటే తనకు ఇష్టమని చెప్పారు.

అండర్19 ప్రపంచ కప్ తర్వాత తాను ఒకసారి కోహ్లీని కలిశానని చెప్పిన షారుక్.. అతని జీవితం క్రమశిక్షణతో కూడకున్నదిన తెలిపారు. మైదానంలోనూ దూకుడుగా ఉన్నప్పటికీ అతని ప్రవర్తన బాగుంటుందని చెప్పారు. షోయబ్ అక్తర్, జహీర్ ఖాన్ లతోపాటు కాసేపు వ్యాఖ్యాతగా వ్యవహరించారు షారుక్.
దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ చూసేందుకు తన స్నేహితులతో కలిసి వెళ్లానని గుర్తుచేసుకున్నారు షారుక్. పాకిస్థాన్ తో జరిగిన ఆ మ్యాచులో మిస్బావుల్ హక్ షాట్ కొట్టడంతో తన గుండె ఒక్కసారి గొంతుకలోకి వచ్చిందని.. ఆ బంతిని శ్రీశాంత్ క్యాచ్ పట్టడంతో కుదుటపడ్డానని తెలిపారు. అది నాకు నచ్చిన సందర్భమని తెలిపారు.
తాజా మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. మ్యాచ్ గెలిచిన ఇండియాకు కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు. తన పేద గుండె ఒక్కసారిగా జారిపోయిందని తెలిపారు. ఇంత ఉత్కంఠను మరోసారి తీసుకురాకూడదని వేడుకున్నారు.