
టాస్ గురించి బెంగ లేదు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ... 'మూడు వన్డేల్లో టాస్ గెలవలేదు. మా వ్యూహాల్లో నుంచి టాస్ తీసేశాం. టాస్ గెలుస్తామా లేదా అని ఆందోళన చెందం. ప్రపంచకప్ ముందు కూడా ఈ విషయాన్ని చెప్పాం. ఏదైనా చేయడానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలి. టాస్ గెలిచినా, ఓడినా మైదానంలో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకే ప్రయత్నిస్తాం' అని తెలిపాడు.

అది భారత క్రికెట్‌కు శుభసూచకం
'ప్రత్యర్థి జట్టు విసిరే సవాళ్లను స్వీకరించడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. గత ఎనిమిది నెలల్లో టీమిండియాలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రతిభావంతులు జట్టులోకి వచ్చారు. సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతూకంగా ఉంది. వచ్చిన ప్రతి అవకాశాలను ఒడిసిపడుతున్నారు. పోటీ బాగా పెరిగింది. ఆటగాళ్లు అందరూ తమలోని అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకే కష్టపడుతున్నారు. అది భారత క్రికెట్‌కు శుభసూచకం' అని కోహ్లీ పేర్కొన్నాడు.

కివీస్ పర్యటనకు సిద్ధం
'మూడో వన్డే మ్యాచ్ గెలవడం ఎంతో ఆనందంగా ఉంది. రెట్టించిన ఉత్సాహంతో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లవచ్చు. ఒకవేళ ఓటమి చవిచూస్తే కాస్త నిరాశతో వెళ్లాల్సి వచ్చేది. ఏదేమైనా మేం ఒత్తిడిలో రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్నాం. ఈ విజయం మాకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఆత్మవిశ్వాసంతో మరిన్ని విజయాలు సాధిస్తాం. గత ఏడాది కివీస్ పర్యటనలో రాణించాం. ఈసారి పర్యటనలో కూడా మంచి ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సొంత గడ్డపై కచ్చితంగా గెలవాలనే పట్టుదల వారిలో ఉంటుంది. మనం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగితే వారిపై ఒత్తిడి పెరుగుతుంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
