న్యూఢిల్లీ: భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహం త్వరలోనే జరగబోతున్నట్లు తెలిసింది. అందుకోసమే ఓ కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఈ ప్రేమజంట ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు కోహ్లీ-అనుష్కలకు వివాహానికి సంబంధించిన వారి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జనవరి 23, 2016లో వీరిద్దరి వివాహం జరగనున్నట్లు ఆ వెడ్డింగ్ కార్డులో ఉంది.

అయితే, ఆ పెళ్లికార్డులో అనేక తప్పులున్నాయి. 23rd ఉండాల్సి ఉండగా, 23th అని రాసివుంది. వారి వివాహ రిసెప్షన్ ముంబైలోని తాజ్ హోటల్స్‌లో జరగనున్నట్లు కార్డులో పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ తల్లిదండ్రులు సరోజ్ కోహ్లీ, ప్రేమ్ కోహ్లీ అయితే ఆ కార్డులో సురభి, అరుణ్ కోహ్లీ అని రాసివుంది.
విరాట్-అనుష్కల వివాహ మహోత్సవానికి 'మీరు తప్పక హాజరుకావాలి' అని కార్డులో పేర్కొన్నారు. ఆ వెడ్డింగ్ కార్డు ఫేస్‌బుక్‌లో పెట్టిన కొద్ది సేపటికే తీసేయడం గమనార్హం. విరాట్, అనుష్కల పేర్లు కార్డు మధ్యలో ఉండాల్సి ఉండగా, వారి కుటుంబసభ్యుల తర్వాత ఉన్నాయి.
ఇంకా, ఆ కార్డులో అనుష్క తల్లిదండ్రుల పేర్లు కూడా తప్పుగా పేర్కొనబడ్డాయి. ఆమె తల్లిదండ్రులు అజయ్ కుమార్ శర్మ, అషీమా శర్మ కాగా, కార్డులో నీలిమా, మేజర్ అర్జున్ సింగ్ అని రాసివుంది.
కాగా, కోహ్లీ-అనుష్కల పెళ్లి కార్డును చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు చెప్పడం కూడా మొదలుపెట్టారు. మరికొందరు ఆశ్చర్య వ్యక్తం చేశారు. అయితే, ఈ వెడ్డింగ్ కార్డును చూస్తుంటే మాత్రం... ఇది కొందరు అభిమానులు చేసిన పిచ్చి ప్రయత్నంగా తెలుస్తోంది.