Viral Video: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, యూఏఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కొట్టిన ఓ అద్భుతమైన సిక్స్‌కు పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ మైమరిచిపోయాడు. కామెంటరీ బాక్స్‌లో కూర్చున్న వసీం అక్రమ్.. ఆ షాట్ చూసి పొగిడేస్తూ ఊగిపోయాడు. ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ తన ఆటతో అభిమానులను అలరించాడు. గిల్ అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ బ్యాటర్‌గా బరిలోకి దిగి.. 9 బంతుల్లో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నప్పటికీ.. శుభ్‌మన్ గిల్ కూడా బ్యాట్‌తో సత్తా చాటాడు. తన చిన్న ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఒక అద్భుతమైన సిక్సర్ కొట్టాడు.
ముఖ్యంగా గిల్ సిక్స్ కొట్టిన తీరు చాలా అద్భుతంగా ఉంది. శుభ్‌మన్ గిల్ సిక్స్ కొట్టగానే.. కామెంటరీ బాక్స్‌లో వసీం అక్రమ్ ఉద్వేగానికి లోనయ్యాడు. "ఆ షాట్ చూడండి! నమ్మలేకపోతున్నాను. కేవలం మణికట్టుతో కొట్టిన షాట్... అద్భుతమైనది" అని వాసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే, టీమిండియా బౌలర్లు యూఏఈ జట్టును కేవలం 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ చేశారు. కుల్‌దీప్ యాదవ్ 4 వికెట్లు, శివమ్ దూబే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని కుప్పకూల్చారు.

టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యూహం ఫలితాన్నిచ్చింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ, "పిచ్ ఎలా ఉందో చూడాలని బౌలింగ్ ఎంచుకున్నాం. రెండో ఇన్నింగ్స్‌లో కూడా పిచ్ అలాగే ఉంది. మా కుర్రాళ్ల నుంచి మంచి దృక్పథం, శక్తిని ఆశించాం, అదే దొరికింది. ఇటీవల చాలామంది అబ్బాయిలు ఇక్కడే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఉన్నారు. వికెట్ బాగుంది కానీ నెమ్మదిగా ఉంది, కాబట్టి స్పిన్నర్లకు ముఖ్యమైన పాత్ర ఉంటుంది" అని అన్నాడు.
అలాగే, అభిషేక్ శర్మను అభినందిస్తూ.. "అభిషేక్ ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్. అతను ఆటను నడిపిస్తాడు. మనం 200 పరుగులను ఛేజ్ చేసినా, 50 పరుగులను ఛేజ్ చేసినా, అతని ఆట నమ్మశక్యం కానిది. పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ కోసం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని పేర్కొన్నాడు.