
క్రికెట్ క్రీడలో కాంట్రవర్సీలకు కొదవ లేదు. ఇలాంటి గొడవల వల్ల క్రికెట్ రూల్స్ కూడా ఒక్కోసారి మార్చాల్సి రావడం మనకు తెలిసిందే. గతేడాది నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని బ్యాటర్‌ను రనౌట్ చేయడం విషయంలో ఇలాంటి సంచలన నిర్ణయమే ఐసీసీ తీసుకుంది. అంతకుముందు వరకు 'మన్కడింగ్' అనేది క్రికెట్‌లో క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పిన ఐసీసీ.. దాన్ని రనౌట్‌గా మార్చింది. ఇప్పుడు కొత్త సంవత్సరం మొదలైన రోజునే మరో కొత్త కాంట్రవర్సీ ఈ క్రీడను చుట్టుముట్టింది.
బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్లు తలపడ్డాయి. ఈ సమయంలో మంచి జోరు మీద ఆడుతున్న సిడ్నీ బ్యాటర్లు భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు. ఇలా సిడ్నీ బ్యాటర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ కష్టపడి అందుకున్నాడు. అయితే చివరి నిమిషంలో బ్యాలెన్స్ నిలుపుకోలేక బౌండరీ దాటేశాడు. ఆ సమయంలో తెలివిగా ఆలోచించిన అతను.. బంతిని గాల్లోకి ఎగరేశాడు. ఈ క్రమంలో సరైన కంట్రోల్ లేకపోవడంతో బంతి కూడా బౌండరీ లైన్ అవతలే పడేలా కనిపించింది.
ఇది చూసిన సదరు ఫీల్డర్.. బంతిని మళ్లీ టచ్ చేసే సమయంలో గాల్లోకి జంప్ చేశాడు. అలా జంప్ చేసి బంతిని పట్టుకొని బౌండరీ లైన్ ఇవతలకు దాన్ని విసిరాడు. అది కింద పడేలోపు ముందుకు దూకి దాన్ని పట్టేశాడు. దీంతో సదరు బ్యాటర్ అవుటైనట్లు అంపైర్ ప్రకటించాడు. ఇది చూసిన అభిమానులు నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించి క్రికెట్‌లో ఏవైనా నిబంధనలు ఉన్నాయా? దాన్ని అవుట్ ఎలా ఇస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ లెక్కన బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లు బౌండరీ లైన్ ఆవల నుంచి ఫీల్డింగ్ చేస్తే ఏం చేస్తారు? అని అడుగుతున్నారు. వాళ్లు కూడా బంతిని టచ్ చేసే ముందు గాల్లోకి ఎగిరితే.. సిక్సర్ ఇవ్వరా? అని నిలదీస్తున్నారు. అయితే క్రికెట్ నిబంధనల ప్రకారం, ఇది అవుటేనని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే సదరు ఫీల్డర్ మైదానంలో ఉన్న వారిలో ఒకడు. అలాగే బంతి ఆటలో ఉంది. మరి ఈ విషయంలో కూడా ఐసీసీ ఏమైనా కొత్తగా మార్పులు చేర్పులు చేస్తుందేమో చూడాలి.